Dharani
Dharani
దేశంలో విద్యను ప్రోత్సాహించడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థులను ఆదుకునేందుకు.. వారిని మరింత ప్రోత్సాహించేందుకు ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేవలం దేశీయంగా మాత్రమే కాక విదేశాల్లో జరిగే పలు పోటీల్లో మన విద్యార్థులు పాల్గొని.. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. మన దేశంలో ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు.. విదేశాల్లో నిర్వహించే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి గాను.. వారికి ఆర్థిక సాయం అందజేసేందుకు ఓ పథకాన్ని తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. దీని ద్వారా అర్హులైన విద్యార్థి ఒక్కక్కిరికి లక్ష చొప్పున ఒక టీమ్‌లోని పది మందికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేస్తోంది కేంద్ర ప్రభుత్వం.
ఈ మొత్తాన్ని విద్యార్థులు వారి విమాన, రైలు ప్రయాణ టికెట్లు, బస, భోజనం, రిజిస్ట్రేషన్, వీసా ఫీజులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పోటీల్లో పాల్గొని తిరిగి వచ్చాక.. ఖర్చుకు సంబంధించిన లెక్కలు సమర్పించాల్సి ఉంటుంది.
దేశంలో బీఈ, బీటెక్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎం టెక్, ఎంఈ ఫస్టియర్, సెకండియర్ చదువుతున్న విద్యార్థులు.. విదేశాల్లో జరిగే అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనడానికి గాను వారికి ఆర్థిక సాయం అందించేందుకు వీలుగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఈ పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థులకు అంతర్జాతీయ సైన్స్ పోటీలకు సంబంధించి ఆహ్వానం ఉన్నట్లయితే.. అవి జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పోటీలుగా గుర్తింపు పొందినవి అయితే.. అలాంటి పోటీల్లో విద్యార్థులు పాల్గొనడానికి కేంద్ర ప్రభుత్వం అలానే ఏఐసీటీఈ వారికి ఆర్థిక సహాయం అందజేస్తాయి.
ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఇంజనీరింగ్ కాలేజీల్లో బీఈ, బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంబీ, ఎంటెక్ ఫస్టియర్, సెకండియర్ చదువుతోన్న విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హులే. అయితే పోటీలకు వెళ్లే విద్యార్థుల బృందంలో కనీసం 10 మందికి తగ్గకుండా ఉండాలి.