Dharani
బిగ్‌బాస్ అవకాశం కల్పిస్తానని చెప్పి.. తన దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్న వ్యక్తి మీద యాంకర్ స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు..
బిగ్‌బాస్ అవకాశం కల్పిస్తానని చెప్పి.. తన దగ్గర నుంచి లక్షల్లో డబ్బులు తీసుకున్న వ్యక్తి మీద యాంకర్ స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ వివరాలు..
Dharani
మన దగ్గరనే కాక దేశవ్యాప్తంగా బిగ్‌బాస్ రియాలిటీ షోకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఒక్కసారి దీనిలో పాల్గొనే అవకాశం వస్తే.. తమ జీవితం సెటిల్ అవుతుందని భావిస్తారు. చిన్నాచితక సెలబ్రిటీలు మొదలు.. టాప్ సెలబ్రిటీల వరకు అందరూ బిగ్‌బాస్ అవకాశం కోసం ఎదురు చూస్తారు. కప్ గెలిచామా లేదా అన్నది మ్యాటర్ కాదు. ఒక్కసారి బిగ్ బాస్ హౌజ్‌లో కనిపిస్తే చాలు తమ కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తారు. ఇక తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకుంది. 7వ సీజన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచి.. దేశంలోనే రికార్డు సృష్టించాడు.
అయితే ఈ సారి బిగ్‌బాస్ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత చోటు చేసుకున్న అల్లర్లు, గొడవలు బిగ్‌బాస్ చరిత్రలో ఎన్నటికి మాయని మచ్చగా నిలిచిపోతాయి. అదలా ఉంచితే.. బిగ్‌బాస్ అవకాశం పేరుతో కొందరు మోసాలకు కూడా పాల్పాడుతుంటారు. తాజాగా ఓ యాంకర్ బిగ్‌బాస్ అవకాశం కోసం లక్షల్లో మోసపోయి.. పోలీసులను ఆశ్రయించింది. ఆ వివరాలు..
బిగ్‌బాస్ సీజన్ 7 లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి లక్షల్లో డబ్బులు తీసుకొని మోసం చేశాడంటూ యాంకర్, నటి స్వప్నా చౌదరి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. ఖమ్మం జిల్లాకు చెందిన స్వప్నా చౌదరి అలియాస్ స్వప్న చిన్న చిన్న కార్యక్రమాలకు యాంకర్‌గా, ఈవెంట్ ఆర్గనైజర్‌గా పని చేస్తూ.. గుర్తింపు తెచ్చుకుంది. అయితే స్వప్నకు బిగ్‌బాస్ షోలో పాల్గొనాలని ఆశ. బీబీ అవకాశం కోసం ప్రయత్నాలు చేసేది. ఈ విషయం తెలుసుకున్న సత్య అనే వ్యక్తి.. స్వప్నను కలిశాడు. తనను తాను మాటీవీ ప్రొడక్షన్ ఇన్‌చార్జ్‌గా పరిచయం చేసుకున్నాడు.
ఇలా ఉండగా ఆరు నెలల క్రితం బిగ్ బాస్ ఇంచార్జ్ అంటూ తమిళ రాజు అనే వ్యక్తిని.. యాంకర్ స్వప్నకు పరిచయం చేశాడు సత్య. బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో తప్పకుండా అవకాశం కల్పిస్తానని.. దానిలోకి వెళ్లడానికి, అందులో వేసుకోవాల్సిన దుస్తుల కోసం సుమారు ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని తెలిపాడు. అందుకు అంగీకరించిన స్వప్న ముందుగా 2.5 లక్షలు తమిళరాజుకు ఇచ్చింది. ఆమెను ఏడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పంపిస్తామని మాట ఇచ్చారు సత్య, తమిళరాజు. అవకాశం రాకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పడమే కాక.. అగ్రిమెంట్ కూడా రాసిచ్చారు. దాంతో గతేడాది జూన్ నుంచి పలు దఫాల్లో తమళ రాజుకు 2.5లక్షలు ఇచ్చింది స్వప్న.
బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభం అయ్యే చివరి క్షణం వరకు ఆమెకు అవకాశం ఇప్పిస్తానని చెప్పి ఆఖరికి మోసం చేశాడు. దాంతో స్వప్న తాను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరింది. అదేమీ జరగలేదు. కానీ తమిళ రాజు డబ్బులు ఇవ్వకపోగా.. బెదిరింపులకు దిగాడు. దాంతో పోలీసులను ఆశ్రయించింది స్వప్న. యాంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో మిస్టరీ, నమస్తే సేట్ జీ అనే చిన్న సినిమాల్లోనూ నటించింది స్వప్నా చౌదరి. అలాగే పలువురు సినీ సెలబ్రిటీలతో ఆమెకు మంచి సంబంధాలున్నాయి. దీనికి సంబంధించి స్వప్న కొన్ని రోజుల క్రితమే వీడియోను రిలీజ్ చేసింది. దానిలో తమిళ రాజు చేతిలో తాను ఎలా మోసపోయిందో సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టింది. ఇప్పుడిదే విషయమై పోలీసులను ఆశ్రయించింది స్వప్న.