భారీగా తగ్గిన టమాటా ధర.. గొల్లుమంటున్న రైతులు!

15 రోజుల ముందు వరకు ప్రజలకు చుక్కలు చూపించిన టమాటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. తగ్గటం అంటే అంతా ఇంతా కాదు.. ఏకంగా అథఃపాతాలానికి పడిపోతున్నాయి. గతంలో కిలో 250 రూపాయలు పలగ్గా.. ఇప్పుడు 30-40 పలకటమే కష్టంగా మారింది. మొన్నటి వరకు టమాటా కారణంగా లాభాలు చూసిన రైతులు.. ఇ‍ప్పుడు దారుణంగా పడిపోయిన మార్కెట్‌ ధరలతో గొల్లుమంటున్నారు.  మార్కెట్‌ యార్డులలో టమాటా ధరలు రైతులకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌, కర్నూలు జిల్లాలోని పత్తికొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డులో  శుక్రవారం నుంచి టమాటా కొనుగోళ్లు పూర్తి స్థాయిలో ప్రారంభం అయ్యాయి. ఇక్కడ టమాటా ధరలు చాలా తక్కువగా ఉన్నాయి.  రైతులు మొదటి రోజున 10 టన్నుల టమాటాను యార్డుకు తీసుకువచ్చారు. ఆ టమాటా సరుకును వేలం వేయగా.. క్వింటాకు కేవలం వెయ్యి మాత్రమే పలికింది. దీంతో కిలో టమాటాలు 10 రూపాయలకే వస్తున్నాయి. టమాటా ధరలు ఇంత భారీగా తగ్గటంతో జనం ఈ మార్కెట్‌ యార్డుకు ఎగబడుతున్నారు.

పెద్ద మొత్తంలో టమాటాలు కొనుక్కుని వెళుతున్నారు. ఇక, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా టమాటా దిగుబడి అధికంగా ఉంది. ఈ కారణంగానే భవిష్యత్తులో టమాటా రేట్లు మరింత తగ్గే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లకు రాయలసీమ నుంచే ఎక్కువ టమాటా సరఫరా అవుతూ ఉంటుంది. ఇక్కడి మార్కెట్‌ రేట్లను బట్టే మిగిలిన జిల్లాల్లో ధరలు నిర్ణయించబడతాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో కిలో టమాటా ధర 40 రూపాయలుగా ఉంది. మరి, టమాటా ధరలు దారుణంగా పడిపోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments