గురువారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు అధికార వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అసెంబ్లీలో తొలుత ప్రశ్నోత్తరాలపై స్పీకర్ చర్చ చేపట్టారు. అయితే సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ వాయిదా తీర్మానంపై నోటిసులులిచ్చారు. ఈ క్రమంలోనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగింది. తమ వాయిదా తీర్మానాన్ని వెంటనే చర్చించాలని పట్టుబడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనలు చేశారు.
గురువారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. అధికార వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చంద్రబాబు అరెస్ట్ కు నిరసిస్తూ టీడీపీ నేతలు ఇచ్చిన వాయిదా తీర్మనాన్ని స్పీకర్ తిరష్కరించారు. దీంతో వారు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పేపర్లు విసురుతూ ఆందోళన చేశారు. ఈ క్రమంలోనే మంత్రులకు, టీడీపీ ఎమ్మెల్యేకు మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. హిందుపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. అధికార పక్షం వైపు చూపిస్తూ మీసం తిప్పాడు. బాలకృష్ణ మీసాలు తిప్పడంపై మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మీసం తిప్పడాలు సినిమాల్లో చూపించుకోవాలని మంత్రి అంబటి కౌంటర్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు స్పీకర్ మీద దాడికి సిద్ధ పడుతున్నారని, సభలో అవాంఛనీయ ఘటనలు జరిగేలా రెచ్చగొడుతున్నారని మంత్రి అంబటి ఆరోపించారు. టీడీపీ సభ్యుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలానే శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి.. బాలకృష్ణవైపు చూస్తూ తొడ కొట్టారు. ఇక టీడీపీ వారికి పోటీగా వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఆందోళన చేశారు. టీడీపీ సభ్యులు ఆందోళన విరమించాలని స్పీకర్ తమ్మినేని సీతారాం దండపెట్టారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు. సభలో గందరగోళం నెలకొనడంతో పది నిమిషాల పాటు సభను వాయిదా వేశారు. టీడీపీ ఆందోళనలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి కూడా ఉన్నారు. మరీ .. ప్రస్తుతం అసెంబ్లీ జరుగుతున్న పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.