iDreamPost
android-app
ios-app

ఉగ్ర రూపం దాల్చిన గోదావరి.. పెరుగుతున్న వరద ఉధృతి!

ఉగ్ర రూపం దాల్చిన గోదావరి.. పెరుగుతున్న వరద ఉధృతి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. గత రెండు, మూడు రోజులనుంచి ఎడ తెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులకు సైతం వరద నీరు పెద్ద ఎత్తున చేరుతోంది. దీంతో నదుల్లో నీటి మట్టం ప్రమాదకర స్థాయిలకు చేరుకుంటోంది. ఇక, ఈ నేపథ్యంలోనే గోదావరి ఉగ్ర రూపం దాల్చింది. గంట, గంటకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతోంది.

ప్రస్తుతం నీటి మట్టం 12.30 అడుగులకు చేరుకుంది. దీంతో అధికారులు బ్యారేజ్‌లోని 175 గేట్లను ఎత్తివేసి 10.55 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేశారు. కాగా, తెలంగాణలో ముందెన్నడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల రికార్డు బ్రేకింగ్‌ స్థాయిలో వర్ష పాతం నమోదైంది. భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో ఏకంగా 616.5 మిల్లీ మీటర్ల వర్షపాతం పడింది. అంతేకాదు! తూర్పు, ఉత్తర తెలంగాణలో భారీ వరదలు వచ్చే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

వరంగల్‌, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, మమబూబాబాద్‌, భద్రాద్రికి ప్రమాదకర వరదలు వచ్చే అవకాశం ఉందని తెలంగాణ వెధర్‌ మ్యాన్‌ ట్విటర్‌ ఖాతా పేర్కొంది. ఇక, ఈ గురువారం మొత్తం ఏకధాటిగా వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ వ్యాప్తంగా మారో మూడు రోజులు వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే 10 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మరి, గోదావరికి అంతకంతకూ వరద ఉధృతి పెరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.