Venkateswarlu
Venkateswarlu
చంద్రయాన్ 3 సాధించిన విజయం భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్త్రో)లో కొత్త ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇస్రో సరి కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుడుతోంది. అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసే పనిలో నిమగ్నమైంది. చంద్రుడిపై జెండా ఎగరేసిన ఇస్రో దృష్టి ఇప్పుడు సూర్యుడిపై పడింది. మిషిన్ ఆదిత్య పేరిట ఓ అద్భుతమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. సూర్యుడి రహస్యాలను ఛేదించేందుకు ఆదిత్య ఎల్-1 మిషన్ అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపటానికి ఏర్పాట్లు చేసింది. మరికొన్ని గంటల్లో ఆదిత్య ఎల్-1 సూర్యుడి దగ్గరకు దూసుకెళ్లనుంది.
ఇంతకీ ఏంటీ మిషన్ ఆదిత్య?
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ సూర్యుడిపై పరిశోధనల కోసం మిషిన్ ఆదిత్య అనే ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆదిత్య ఎల్-1 అనే ఉపగ్రహాన్ని సూర్యుడికి దగ్గరగా పంపనుంది. ఆదిత్య ఎల్-1 ద్వారా కరోనాతో పాటు సూర్యుడి కాంతి కిరణాల ప్రభావంపై పరిశోధనలు చేయనుంది. అంతేకాదు! సౌర మండలంలోని గాలులపై కూడా అధ్యయనం చేయనుంది.
సౌర తుఫాన్ల సమయంలో వెలువడే రేణువులతో పాటు కాంతిమండలం, వర్ణమండలంపై పరిశోధనలు చేయనుంది. ఈ ఉపగ్రహాన్ని జియో ట్రాన్స్‌ఫర్ కక్ష్యలోకి ప్రవేశపెడతారు. భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రేంజియన్ పాయింట్‌లోకి ఇది వెళ్లనుంది. ఈ ఉపగ్రహం 109 నుంచి 177 రోజుల పాటు నింగిలో ఉండనుంది. సూర్యుడికి దగ్గరగా ఉంటూ పరిశోధనలు చేయనుంది. ఇందుకోసం ఇస్రో దాదాపు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
ఆదిత్య ఎల్-1 గురించిన మరిన్ని వివరాలు!
ఆదిత్య ఎల్-1 సూర్యుడి దగ్గరకు వెళ్లటానికి సంబంధించి కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం ఉదయం 11.50కి ఆదిత్య ఉపగ్రహం నింగిలోకి ఎగరనుంది. పీఎస్‌ఎల్‌వీ-సీ57 రాకేట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. బెంగళూరులోని యూఆర్ రావ్ సాటిలైట్ సెంటర్ నుంచి ఉపగ్రహాన్ని శ్రీహరి కోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్‌కు తీసుకొచ్చారు. మరి, సూర్యుడి రహస్యాలను ఛేదించటానికి ఇస్రో ఆదిత్య మిషన్‌ను చేపట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.