దేశంలోనే అతి పెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌కు శంఖుస్థాపన చేసిన సీఎం జగన్‌

దేశంలోనే అతి పెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కానుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. బుధవారం వర్చువల్‌గా ఈ ప్రాజెక్ట్‌కి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8 వేల ఎకరాల్లో దేశంలోనే అతి పెద్ద సోలార్‌ పవర్‌ ప్లాంట్‌ని ఏపీలో ఏర్పాటు చేయబోతున్నాం అని తెలిపారు. నంద్యాల జిల్లా పిక్కిళ్లపల్లి తండాలో పైలాన్‌ ప్రాజెక్ట్‌ రాబోతుంది అన్నారు. 2300 మెగా వాట్ల సామార్థ్యం గల ఈ ప్రాజెక్ట్‌ని కొండ ప్రాంతాలైన మారేమడుగుల, పిక్కిళ్లపల్లి గ్రామాల మధ్య ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ వల్ల భారీ సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్నారు సీఎం జగన్‌.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘పర్యావరణహితంగా ఈ ప్రాజెక్ట్‌ ఉంటుంది. సోలార్‌ ఎనర్జీ కోసం రూ.2.49 పైసలతో ఒప్పందం కుదుర్చుకున్నాం. రైతులకు ఉచిత విద్యుత్‌కు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. మరికొన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ప్లాంట్‌లు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నాం. గ్రీన్‌ ఎనర్జీ ఉత్పత్తి విషయంలో ఏపీ దేశానికే ఆదర్శంగా నిలవనుంది. ఈ ప్రాజెక్ట్‌ కోసం ఎన్‌హెచ్‌పీసీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. ప్రాజెక్ట్‌లు రావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ప్రాజెక్ట్‌కు భూమి ఇచ్చిన రైతుకు కూడా ప్రతి ఏటా ఆదాయం వస్తుంది. భూమి ఇచ్చిన రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 31 వేల రూపాయలు లీజు రూపంలో ఇస్తాము’’ అని తెలిపారు.

Show comments