బుధవారం ఆంధ్రప్రదేశ్ లో ఆహార శుద్ది, పరిశ్రమలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ గా ప్రారంభించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈ పరిశ్రమలకు ప్రారంభోత్సవం చేశారు. వర్చువల్ విధానంలో సీఎం జగన్ 7 ప్రాజెక్టులకు భూమి పూజతో పాటు మరో 6 ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. తిరుపతి జిల్లా నాయుడు పేటలో రూ.800 కోట్లతో గ్రీన్లామ్ సౌత్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. బాపట్ల జిల్లా కొరిశపాడు వద్ద రూ.225 కోట్లతో శ్రావణి బయో ఫ్యూయల్, శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో రూ.200 కోట్లతో నాగార్జునా ఆగ్రో కెమికల్స్, తూర్పు గోదావరి జిల్లా ఖండవల్లి వద్ద రూ.150 కోట్లతో రవళి స్పిన్నర్స్ ను ఏర్పాటు చేయనున్నారు. అదే విధంగా శ్రీ సత్య సాయి జిల్లా గూడపల్లి వద్ద రూ.125 కోట్లతో యునైటెడ్ ఇండస్ట్రీస్ ఆటో ప్లాస్టిక్, మడకశిర వద్ద రూ.250 కోట్లతో ఎవరెస్ట్ స్టీల్ బిల్డింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. మొత్తం 13 ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా రాష్ట్రంలో రూ.2,851 కోట్ల పెట్టుబడులు రానున్నాయని అన్నారు. 13 జిల్లాల్లో ఏర్పాటైన పరిశ్రమలతో 6,705 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. అలానే పరోక్షంగా చాలామందికి ఉపాధి లభిస్తుందని సీఎం అన్నారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగావకాశాలు దక్కుతాయని సీఎం తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు తమ ప్రభుత్వం ఎప్పుడు అందుబాటులో ఉంటుందని అన్నారు. అదేవిధంగా అన్ని రకాలుగా సహకారం అందిస్తామని పేర్కొన్నారు. అందరూ అధికారులు ఎప్పుడూ వ్యాపార వేత్తలకు అందుబాటులో ఉంటారని సీఎం చెప్పారు. ప్రతి పారిశ్రామిక వేత్తను చేయిపట్టుకుని నడిపించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. వ్యాపార వేత్తల అవసరాన్ని ప్రభుత్వం మన అవసరంగా భావించి… పారిశ్రామిక వేత్తకు సహాయం అందించాలి. అదే విధంగా ఆ ఎంవోయూలని కార్యరూపం దాల్చేలా చర్యలు తీసుకుంటామని సీఎం అన్నారు.