ఇతరులను పొగడటంలో తప్పు లేదు. కానీ తమను తామే పొగుడుకోవడం వింటే ఎవరికైనా కాస్త వింతగా అనిపిస్తుంది. తామే గొప్ప, తమ తర్వాతే ఎవరైనా అంటూ గొప్పలు చెప్పుకునే అలవాటు కొందరికి ఉంటుంది. అలాంటి అలవాటే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకూ ఉందని పొలిటికల్ అనలిస్టులు అంటుంటారు. దీనికి గతంలో చంద్రబాబు గొప్పలు చెప్పుకున్న ఉదాహరణలను చూపుతుంటారు. తనది ప్రధాన మంత్రి రేంజ్ అని ఒకసారి చంద్రబాబు చెప్పడం అప్పట్లో వైరల్‌గా మారింది. తానే ప్రధాని పదవిని తిరస్కరించానని చెప్పి టీడీపీ శ్రేణులు సంబురపడేలా చేశారు చంద్రబాబు.
ఇక, హైదరాబాద్ సిటీ క్రెడిట్‌ను కూడా చంద్రబాబు పదే పదే తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. భాగ్యనగరానికి ముగ్గుపోసింది తానేనని, ఐటీ పరిశ్రమ ఇక్కడకు తరలి వచ్చింది తన వల్లేనని ఆయన గప్పాలు కొడుతుంటారు. ప్రపంచంలో ఎక్కడేం విశేషం జరిగినా అది తనవల్లే జరిగిందనుకునే స్వీయ మానసిక ధోరణి వల్లే చంద్రబాబు ఇలా గొప్పలు చెబుతుంటారని విశ్లేషకులు అంటున్నారు. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా అది పబ్లిక్ మీటింగ్ అవ్వనీయండి, పార్టీ సమావేశం అవ్వనీయండి ఆయన గొప్పలకు పోతూనే ఉంటారు.
అలాంటి చంద్రబాబు నాయుడు మరోమారు గప్పాలు కొట్టారు. ఇప్పటికే చాలా కనిపెట్టానని చెప్పిన టీడీపీ అధినేత.. తాజాగా సెల్ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీని కూడా తానే పరిచయం చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మండపేటలో చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీని తానే పరిచయం చేశానన్నారు. టార్చ్ లైట్ టెక్నాలజీ గురించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సెల్ ఫోన్లో టార్చ్ లైట్ టెక్నాలజీ కూడా నేను పరిచయం చేసిందే – చంద్రబాబు నాయుడు pic.twitter.com/xn8SLfMPYl
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2023