iDreamPost
android-app
ios-app

తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

  • Published Aug 21, 2023 | 11:44 AM Updated Updated Aug 21, 2023 | 11:44 AM
  • Published Aug 21, 2023 | 11:44 AMUpdated Aug 21, 2023 | 11:44 AM
తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పట్టణంలోని జూనియర్ కాలేజీ ప్రహరీ గోడ వ్యవహారంపై వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలో అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సహా పలువురు టీడీపీ నేతలపై పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబంధించి పిల్లర్లను కూల్చివేశారని.. జేసీ సహా ఇతర టీడీపీ నేతల మీద ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అలాగే ముందస్తు జాగ్రత్తగా జేసీ నివాసం దగ్గర భారీగా బందోబస్తు, భారీకేడ్లు కూడా ఏర్పాటు చేశారు పోలీసులు.

తాడిపత్రి సంజీవనగర్ జూనియర్‌ కాలేజీలో జరుగుతున్న నిర్మాణ పనులను జేసీ అడ్డుకున్నారని ఫిర్యాదు చేశారనన్నారు పోలీసులు. కాలేజీకి సమీపంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇల్లు ఉంది. అంతేకాక గత కొన్నేళ్లుగా అక్కడ ఉన్న గ్రౌండ్‌ను.. జేసీ తన రాజకీయ కార్యకలాపాలకు వాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాలేజీలో నిర్మిస్తోన్న కాంపౌండ్ వాల్ నిర్మాణం ఆపేందుకు గుంతలు పూడ్చివేశారు.. 54 పిల్లర్లను జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన అనుచరులు ధ్వంసం చేసినట్లు కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా 14 మంది టీడీపీ నేతలపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు తాడిపత్రి పోలీసులు.

ఈ క్రమంలో తాడిపత్రిలోని జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం దగ్గర ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద పోలీసుల్ని భారీగా మోహరించారు. తాడిపత్రిలో జూనియర్‌ కాలేజీ ప్రహరీ నిర్మాణం విషయంలో ఈ వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇప్పటికే అదనపు ఎస్పీ విజయ్‌భాస్కర్‌రెడ్డి ఘటనాస్థలిని పరిశీలించి.. పోలీసులకు తగు సూచనలు చేశారు.