కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు ఏపీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు వచ్చే భక్తులకు అందించే దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు పెంచింది. ఈ కోటాలో మొన్నటి వరకు ప్రతి రోజూ ఆర్టీసీ ప్రయాణికులకు రాష్ట్రవ్యాప్తంగా 600 టికెట్లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సంఖ్యను 1,000కి పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. బస్సులో ప్రయాణించే భక్తులు బస్సు ఛార్జీకి తోడు వెంకన్న దర్శనానికి రూ.300 దర్శన టికెట్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
వెంకన్న భక్తులు ఇప్పుడు బుక్ చేసుకునే టికెట్లు ఈ నెల 15 నుంచి అక్టోబర్ 7లోపు ప్రయాణాలు, దర్శనానికి ఉపయోగపడతాయి. దర్శన కోటా టికెట్ల బుకింగ్ మంగళవారం నుంచి ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చిందని పల్నాడు జిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్వీ శ్రీనివాసరావు తెలిపారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే భక్తులు దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని ఆయన సూచించారు. ఏపీఎస్ఆర్టీసీనే కాదు టీఎస్ఆర్టీసీ కూడా తిరుమలకు వెళ్లే భక్తులకు రూ.300 శీఘ్ర దర్శనం టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుమలకు వెళ్లే బస్సులకు సంబంధించిన టికెట్లను ఆన్లైన్లో రిజర్వేషన్ చేసుకునే సమయంలోనే రూ.300 దర్శన టికెట్ బుక్ చేసుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక ఆర్టీసీలు కూడా ప్యాసింజర్లకు బస్ టికెట్లతో పాటు రూ.300 టికెట్లను అందిస్తున్నాయి. ఇకపోతే, టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి అందించిన సేవలను నూతనంగా టీటీడీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న భూమన కరుణాకర్ రెడ్డి మెచ్చుకున్నారు. ఈ మేరకు పాలకమండలి సమావేశంలో ఆయన తీర్మానం ప్రవేశపెట్టారు. తన పదవీకాలంలో వైవీ సుబ్బారెడ్డి సామాన్య భక్తులకు మెరుగైన వసతులు అందించేందుకు, దేవాలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని ప్రశంసించారు. ఆయన సేవలను బోర్డు సభ్యులంతా కొనియాడారు. ఆ తర్వాత సుబ్బారెడ్డిని శాలువాతో సత్కరించారు భూమన.