Venkateswarlu
Venkateswarlu
తెలంగాణలో మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించి ప్రభుత్వం తాజాగా లక్కీ డిప్ నిర్వహించిన సంగతి తెలిసిందే. 2023-25 సంవత్సరానికి గాను తెలంగాణ సర్కార్ ఈ లక్కీ డిప్‌ను నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2,620 దుకాణాల కోసం లక్కీడిప్ నిర్వహించగా.. 1,31,964 ధరఖాస్తులు వచ్చాయి. వైన్ షాపుల లైసెన్సుల జారీ కార్యక్రమంలో ఈసారి ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తెలంగాణలో వైన్ షాపుల కోసం ఓ ఏపీ రియల్ ఎస్టేట్ సంస్థ ధరఖాస్తు చేసుకుంది.
పది, ఇరవై కాదు దరఖాస్తులు కాదు.. ఏకంగా 5 వేల దరఖాస్తులు పెట్టింది. ఒక్కో దరఖాస్తుకు రూ. 2లక్షల రూపాయల నాన్-రీఫండబుల్ ఫీజును కూడా చెల్లించింది. ఇలా మొత్తం దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. శంషాబాద్, సరూర్‌నగర్‌లో మద్యం అమ్మకాలకు ఉన్న గిరాకీని దృష్టిలో పెట్టుకుని ఆ సంస్థ దరఖాస్తులు వేసింది. ఆగస్టు 21న నిర్వహించిన లక్కీ డ్రాలో ఈ సంస్థకు ఏకంగా 110 దుకాణాలు దక్కాయి. వైజాగ్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున ఆ సంస్థ తెలంగాణలో మద్యం షాపుల కోసం భారీగా దరఖాస్తులు చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది.
ఒక సంస్థ మద్యం దుకాణాల కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలు వెచ్చించటం తెలంగాణ ఎక్సైజ్ చరిత్రలో ఇదే మొదటి సారి కావటం విశేషం. కాగా, రంగారెడ్డి జిల్లాలో ప్రతీ మద్యం దుకాణానికి సగటున రూ.20 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో 20 శాతం మార్జిన్ వస్తోంది. దీంతో ఈ సారి పోటీ బాగా పెరిగింది. ఈ సారి 2,620 మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానించగా.. ప్రభుత్వానికి ఏకంగా 2,639.28 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. మరి, ఏపీ రియల్ ఎస్టేట్ సంస్థ తెలంగాణలో వైన్ షాపుల కోసం ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.