Dharani
Dharani
ఆంధ్రప్రదేశ్ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు. దసరా పండగకి విశాఖ ప్రజలకు బ్రహ్మాండమైన కానుక ఉండనుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ప్రజలు ఎదురు చూస్తున్న కల దసరాతో తీరుతుందన్నారు. విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా కోలా గురువులు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి గుడివాడ అమర్‌నాథ్, ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు తదితరులు హాజరయ్యరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంత్రి అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరాకు విశాఖ వాసులకు గుడ్‌న్యూస్ చెప్పబోతున్నాం అని చెప్పారు. సీఎం జగన్ ఇక్కడ రూ.1000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యకలాపాలకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు మంత్రి అమర్నాథ్.
మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వ్యాఖ్యలతో విశాఖకు పరిపాలనా రాజధాని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెప్టెంబర్ నాటికి విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంత్రి కూడా దసరా సమయానికి శుభవార్త ఉండనుంది అని చెప్పడంతో.. వమరోసారి విశాఖ పరిపాలనా రాజధాని అంశం తెర మీదకు వచ్చింది. అమర్నాథ్ వ్యాఖ్యలతో.. దసరా నాటికి సీఎం విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తారని మంత్రి సంకేతాలు ఇచ్చినట్లయ్యిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. గతంలో ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు.. వీలైనంత త్వరగా విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామన్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సచివాలయాన్ని అమరావతి నుంచి విశాఖకు తరలిస్తామంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాక విశాఖలో అనేక ప్రభుత్వ భవనాలు అందబాటులో ఉన్నాయని.. వాటి నుంచి పరిపాలన సాగిస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలానే భీమిలి రోడ్డులో ఖాళీగా ఉన్న వాటిని ప్రభుత్వ భవనాలుగా వినియోగిస్తామని తెలిపారు. అంతేకాక భీమిలి రోడ్డులోని భవనాలని కూడా వాడుకుంటామని తెలిపారు. ఇక తాజాగా గుడివాడ అమర్నాథ్ కూడా ఇదే వ్యాఖ్యానించడంతో.. మరోసారి విశాఖ పరిపాలన రాజధాని అనే అంశం తెర మీదకు వచ్చింది.