Dharani
Dharani
రవితేజ హీరోగా నటిస్తోన్న చిత్రం టైగర్ నాగేశ్వరరావుకు ఏపీ హైకోర్టు భారీ షాకిచ్చింది. ఈ సినిమా టీజర్‌పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాక చిత్ర నిర్మాతకు నోటీసులు సైతం జారీ చేసింది. ఇంతకు ఏం జరిగింది అంటే.. తాజాగా విడుదలైన టైగర్ నాగేశ్వరరావు టీజర్‌లో ఓ సామాజిక వర్గాన్ని కించ పరిచేలా ఉండటమేకాక స్టువర్టుపుర గ్రామ ప్రజల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉందంటూ.. చుక్కా పాల్‌రాజ్ అనే వ్యక్తి హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. ఈ సినిమా తమ జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని.. కనుక సినిమా ప్రదర్శనకు ధ్రువీకరణ పత్రం ఇవ్వకుండా.. ఆపాలని పాల్‌రాజ్ కోర్టును కోరారు. ఈ పిల్‌పై ఏపీ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తపరఫున లాయర్లు.. కోర్టులో తమ వాదనను వినిపించారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకుర్, జసిస్ట్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాససం.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా టీజర్‌లో వాడిన పదప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్టుపురం ప్రాంత వాసులను అవమానించేదిగా ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికెట్ లేకుండానే సినిమా టీజర్ ఎలా విడుదల చేస్తారని ప్రశ్నించింది. సమాజం పట్ల బాధ్యతగా ఉండొద్దా అంటూ సినిమా నిర్మాణ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇలాంటి టీజర్ ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఈ సందర్భంగా ధర్మాసనం.. చిత్ర బృందాన్ని ప్రశ్నించింది. అంతేకాక టైగర్ నాగేశ్వరరావు చిత్ర నిర్మాతకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లో ముంబై సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్‌పర్సన్‌ను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు హైకోర్టు ధర్మాసనం సూచించింది. అభ్యంతరాలపై ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు కల్పించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.