iDreamPost
android-app
ios-app

AP: రహదారుల కోత నివారణకు చెక్‌.. FDR సాంకేతికతో రోడ్ల నిర్మాణం

  • Published Aug 04, 2023 | 7:33 PM Updated Updated Aug 04, 2023 | 7:33 PM
  • Published Aug 04, 2023 | 7:33 PMUpdated Aug 04, 2023 | 7:33 PM
AP: రహదారుల కోత నివారణకు చెక్‌.. FDR సాంకేతికతో రోడ్ల నిర్మాణం

జోరు వానలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్లు భారీగా దెబ్బ తిన్నాయి. మరీ ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో చిన్న పాటి జల్లులు కురిసినా రోడ్లు కోతకు గురవుతాయి. దశాబ్దాలుగా ఈ సమస్య వేధిస్తోంది. ఈ క్రమంలో రోడ్ల కోత నివారణకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ తర్వలోనే ముగింపు పలకనుంది. రహదారులకు కోత సమస్యకు చెక్‌ పెట్టడం కోసం ఫుల్ డెప్త్ రిక్లమేషన్ (ఎఫ్‌డీఆర్)సాంకేతికతను వినియోగించనున్నారు. ఎఫ్‌డీఆర్‌ టెక్నాలజీతో త్వరలోనే రాష్ట్రంలో రోడ్ల కోత సమస్యను పరిష్కరించనున్నారు.

ఫుల్ డెప్త్ రిక్లమేషన్ సాంకేతికతతో రహదార్ల నిర్మాణం అంశంపై శుక్రవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్ అండ్బి,పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈసాంకేతిక విధానంలో రోడ్లు నిర్మించేందుకు ఆర్ అండ్బి మరియు పంతాయితీరాజ్ శాఖల పరంగా తీసుకుంటున్నచర్యలను సిఎస్.జవహర్ రెడ్డి వివరించారు.

మెత్తటి నేలల్లో రోడ్లు నిర్మిస్తుండటం వల్ల.. వర్షాలుపడినా, వరదలు వంటి విపత్తులు వచ్చిన నదీతీర ప్రాంతాల్లోని రోడ్లు తరచు కోతకు గురవడం జరుగుతోంది. తీర ప్రాంత జిల్లాల్లో దశాబ్దాలుగా ఈ సమస్య జనాలను ఇబ్బందులకు గురి చేస్తోంది. చిన్నదో, పెద్దదో చినుకు పడితే చాలు.. చిత్తడి అయ్యి రోడ్డంతా కొట్టుకుపోయి కంకర తేలి గుంటలుగా మారిపోతుంది. ఇలాంటి రోడ్లపై వెళ్లే వాహనదారులు నరక యాతన అనుభవిస్తున్నారు. అంతేకాక ప్రతి ఏటా రహదారులు విధ్వంసంతో ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం జరుగుతోంది.

ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశతగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మనం ఇప్పటి వరకు తారు రోడ్లను చూసి ఉంటాం.. సిమెంట్ రోడ్లను చూసి ఉంటాం. కాని ఇపుడు కొత్త విధానంలో రోడ్ల నిర్మాణం అందుబాటులోకి వచ్చింది. అదే ఫుల్ డెప్త్ రిక్లమేషన్ పెర్ఫార్మెన్స్.

ఏంటి ఎఫ్‌డీఆర్‌..

ఈ విధానంలో పాత రోడ్డును యంత్రాల సాయంతో రెండు నుంచి మూడు అడుగుల లోతు వరకు తవ్వకాలు జరుపుతారు. ఆ తర్వాత సిమెంట్‌, కెమికల్‌తో మిక్స్‌ చేసి చదును చేస్తారు. ఆపై ఒకదానిపై మరొకటి లేయర్లను నిర్మిస్తారు. దీంతో రోడ్ల మన్నిక, జీవితకాలం ఎక్కువ రోజులు ఉంటుంది. సాధారణ రోడ్లతో పోల్చుకుంటే.. ఇవి 15 నుంచి 20 ఏళ్లపాటు చెక్కు చెదరకుండా ఉంటాయి. సముద్ర తీరం ప్రాంతాల్లో రోడ్లు నిర్మించాలంటే ముడిసరుకుల రవాణాకే ఎక్కువ మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా ఈ విధానంలో రోడ్లు నిర్మిస్తే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది. నల్ల రేగడి భూములు ఎక్కువగా ఉండే గోదావరి జిల్లాలు,డెల్టా ప్రాంతాలకు ఈ టెక్నాలజీ వరంగా మారబోతుంది అని తెలిపారు.