iDreamPost
android-app
ios-app

పాడేరు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

  • Published Aug 21, 2023 | 8:35 AM Updated Updated Aug 21, 2023 | 8:35 AM
  • Published Aug 21, 2023 | 8:35 AMUpdated Aug 21, 2023 | 8:35 AM
పాడేరు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు భారీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

అల్లూరి జిల్లాలోని పాడేరు ఘాట్‌రోడ్డులో ఆదివారం ఆర్టీసీ బస్సు లోయలో పడి పెను ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. పాడేరు నుండి చోడవరం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పాడేరు ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద ఆదివారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఇక ప్రమాదం సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం కారణంగా ఏడుగురు మృతి చెందగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఇక పాడేరు బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు ఏపీ ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఆ వివరాలు.

పాడేరు బస్సు ప్రమాదం మృతుల కుటుంబాలకు ఏంపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించగా.. తీవ్రంగా గాయపడ్డ క్షతగాత్రులకు రూ.5 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ఇక ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పున ప్రకటించింది. ప్రమాదంపై మంత్రి గుడివాడ అమర్నాథ్‌ స్పందిస్తూ.. ప్రమాదంలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించనున్నట్లు తెలిపారు.

అవసరమైతే విశాఖపట్నం, అనకాపల్లి నుంచి నిపుణులైన డాక్టర్లను తీసుకొచ్చి.. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. క్షతగాత్రులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. పాడేరు ఘాట్ ప్రమాద బాధితులను సీఎం ఆదేశాల మేరకు పరామర్శించానన్నారు. ప్రమాదం పై విచారణకు ఆదేశించామని, డ్రైవర్‌పై కేసు నమోదు చేస్తామని మంత్రి అమర్నాథ్‌ తెలిపారు.

ఇక పాడేరు ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అల్లూరి, అనకాపల్లి, విశాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలని, ప్రమాద కారణాలపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇక ప్రమాదంలో గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందంటున్నారు వైద్యులు. దాంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది అంటున్నారు వైద్యులు. బస్సు 100 అడుగుల లోయలో పడిపోయింది. దీంతో క్రేన్ సాయం బయటకు తీశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్స్ లేకపోవడంతో యాక్సిడెంట్‌ గురించి తెలియడానికి కాస్త సమయం పట్టింది.