డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌!

మహిళా సాధికారత విషయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం ఎక్కడా తగ్గటం లేదు. మహిళలు ఆర్థికంగా వృద్ధి సాధించటం కోసం రాజీలేని కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే డ్వాక్రా మహిళలకు సీఎం జగన్‌ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. మరో విడత సున్నా వడ్డీ డబ్బులను వారి ఖాతాలో జమ చేయనుంది. పొదుపు సంఘాల మహిళల బ్యాంకు రుణాలకు సంబంధించి శుక్రవారం నాలుగో విడత వడ్డీ డబ్బుల్ని విడుదల చేయనుంది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి లబ్దిదారుల అకౌంట్‌లలోకి డబ్బులు జమ చేయనున్నారు.

దాదాపు 9.48 లక్షల డ్వాక్రా గ్రూపులలోని మహిళల కోసం 1358.78 కోట్ల రూపాయలను విడుదల చేయనున్నారు. డ్వాక్రా మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలను.. అది కూడా గత అసెంబ్లీ ఎన్నికల నాటికి తీసుకున్న రుణాల వడ్డీని ప్రభుత్వం ఇప్పుడు చెల్లిస్తోంది. సకాలంలో రుణాలు చెల్లించే పొదుపు సంఘాల మహిళలకు ఇప్పటి వరకు 4,969 కోట్ల రూపాయలు చెల్లించటం జరిగింది. అంతేకాదు.. జగన్‌ సర్కార్‌ బ్యాంకర్లతో సమావేశం జరిపి.. పొదుపు సంఘాల మహిళల రుణాలపై 9 శాతం వడ్డీ వర్తింపజేసేలా చర్యలు తీసుకున్నారు.

కాగా, పొదుపు సంఘాలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకాన్ని ప్రవేశ పెట్టింది. ప్రభుత్వమే డ్వాక్రా మహిళలు తీసుకున్న అప్పు వడ్డీని కడుతోంది. ఓ సంవత్సరంలో సమయానికి చెల్లించిన రుణాల వడ్డీని ప్రభుత్వం చెల్లిస్తోంది. సకాలంలో వాయిదాలు చెల్లించని పొదుపు సంఘాలు ఈ పథకానికి అనర్హం. అంతేకాదు! ఐదు లక్షల రూపాయల కంటే ఎక్కువ మొత్తం తీసుకున్న సంఘాలు కూడా అనర్హం. ఇక, జులై 26న వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమం జరగాల్సి ఉండింది. కానీ, వర్షాల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడింది.

Show comments