చంద్రబాబుపై మరో పీటీ వారెంట్.. పిటీషన్ ను విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు

స్కిల్ స్కామ్ కేసులో ఏపీ సీఐడీ చేత అరెస్టు కాబడి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడిపై మరో పీటీ వారెంట్ దాఖలైంది. ఏపీ సీఐడీ ఫైబర్ నెట్ కుంభకోణంలో బాబుపై పీటీ వారెంట్ ను ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. కాగా ఈ పిటీషన్ ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా సిట్ విచారణలో తేలిందని సీఐడీ తెలిపింది. ఈ కుంభకోణంలో రూ. 115 కోట్ల నిధులను దోచుకున్నట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సీఐడీ గుర్తించింది. అయితే ఫైబర్ నెట్ స్కాంకు సంబంధించి 2021లోనే 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. అప్పటి ఎఫ్ఐఆర్ లో ఎ1గా వేమూరి హరిప్రసాద్, ఎ2గా మాజీ ఎండీ సాంబశివరావు. వీరిలో వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు.

ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్రను గుర్తించి ప్రధాన ముద్దాయిగా తేల్చింది సీఐడీ. టెర్రాసాఫ్ట్ కంపెనీకి అక్రమంగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టారని గుర్తించింది. గతంలో ఏపీ సివిల్ సప్లైస్ కు టెర్రాసాఫ్ట్ సేవలందించింది. అయితే నాణ్యత లేని ఈ-పోస్ మిషన్లను సరఫరా చేసినందుకు టెర్రాసాఫ్ట్ ను బ్లాక్ లిస్టులో పెట్టిన అధికారులు. అయినప్పటికి టెర్రాసాఫ్ట్ ను బ్లాక్ లిస్టు నుంచి చంద్రబాబు సర్కార్ తొలగించి టెండర్లను కట్టబెట్టింది. హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్ కంపెనీతో టైఅప్ అయి ఫైబర్ నెట్ ప్రాజెక్టును దక్కించుకుంది. ఆ తర్వాత ఆ కంపెనినీ టెర్రాసాఫ్ట్ బయటికి పంపింది. నిబంధనలకు విరుద్దంగా మరో కంపెనీ నుంచి 121 కోట్ల నాసిరకం మెటీరియల్ ను కొనుగోలు చేసిన టెర్రాసాఫ్ట్ ఫైబర్ నెట్ కు సరఫరా చేసింది. ఈ వ్యవహారమంతా చంద్రబాబు సూచనలమేరకే జరిగిందని సీఐడీ తేల్చింది.

Show comments