iDreamPost

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయా..?

టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ కలిసి పోటీ చేస్తాయా..?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసి మూడురోజులు అవుతున్నా.. ఆ సమావేశాల్లో చోటు చేసుకున్న పరిణామాల తాలుకూ రాజకీయం ఇంకా కొనసాగుతోంది. గవర్నర్‌ ప్రసంగం లేకుండానే బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభించడంతో బీజేపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తంచేయడం, వారిని బడ్జెట్‌ సెషన్‌ పూర్తయ్యే వరకు సస్పెండ్‌ చేయడంతో పరిణామాలు టీఆర్‌ఎస్‌ వెర్సస్‌ బీజేపీగా మారిపోయాయి. ఆ పార్టీ నేతల మధ్య వాడివేడి మాటలు, సవాళ్లు నడుస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితి మారిపోయింది. బీజేపీ దూకుడుతో కాంగ్రెస్‌ వెనుకబడిపోయింది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేలా పరిస్థితులు మారిపోతున్నాయి.

అధికార పార్టీపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ఈ సమావేశాల్లో అంత దూకుడుగా వ్యవహరించలేదు. ఈ కారణం చేత బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లు కలిసి పోటీచేస్తాయని ఆయన విమర్శించడం గమనార్హం. తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే ఇప్పటి వరకు పోటీ జరిగింది. రెండు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం సాధించగా.. కాంగ్రెస్‌ ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయింది. గత ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటుకే పరిమితం అయింది. ఉప ఎన్నికల్లో మరో రెండు సీట్లు గెలుచుకుని ఆ సంఖ్యను మూడుకు పెంచుకుంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో జరగబోయే శాసనసభ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ జరుగుతుంది.

రఘునందన్‌ రావు వ్యాఖ్యలు.. టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెప్పేలా ఉన్నాయి తప్పా.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అయితే బీజేపీ మునుపటి కన్నా బాగా పుంజుకుంది. ఆ పార్టీ నేతలు బండి సంజయ్, అరవింద్, ఈటెల రాజేందర్‌లు కేసీఆర్‌ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్నారు. ఈ దూకుడు కాంగ్రెస్‌ పార్టీ చూపడం లేదు. పీసీసీ అధ్యక్షుడు అయిన కొత్తలో రేవంత్‌ రెడ్డి కొంత దూకుడుగా వెళ్లినా.. ఆ తర్వాత ఆ స్పీడు తగ్గింది. ఫలితంగా టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కరీంనగర్‌లో పర్యటించిన కేటీఆర్‌.. బండి సంజయ్‌కు సవాల్‌ విసిరారు. మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీ చేసి గెలవాలని కమల దళపతికి ఛాలెంజ్‌ విసిరారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ నుంచి ఈ సవాల్‌ రావడం తెలంగాణలో బీజేపీ స్థానాన్ని తెలియజేస్తోంది. బీజేపీ ఇదే దూకుడుతో వెళితే.. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరిగే అవకాశం లేకపోలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి