కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చిన వరుణుడు.. ప్రస్తుతం దంచికొడుతున్నాడు. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం ప్రారంభమైన వాన.. సోమవారం కూడా ఆగకుండా పడుతూనే ఉంది. హైదరాబాద్ మహానగరంలో ఏకధాటిగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలోనే నేటి నుంచి రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షం పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎడతెరపిలేకుండా వరుణుడు దంచికొడుతున్నాడు. ఇక రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పల్ లో నమోదు అయ్యింది. ఇక్కడ 15.7 సెం.మీ వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. నిజామాబాద్ తో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ను జారీ చేసింది. విస్తారంగా కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఈ క్రమంలోనే తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జనగామ, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాలోని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా.. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరీవాహక ప్రాజెక్ట్ లకు స్వల్పంగా వరదనీరు వచ్చి చేరుతోంది. కొన్ని ప్రాజెక్ట్ లకు వరదనీరు ఎక్కువ చేరడంతో.. గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు.