iDreamPost
android-app
ios-app

ఈ రోజునుంచే వారి అకౌంట్లలోకి రూ. లక్ష!

ఈ రోజునుంచే వారి అకౌంట్లలోకి రూ. లక్ష!

వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతి వృత్తిదారులకు ఆర్థిక సాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించిన సంగతి తెలిసిందే. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంచిర్యాలలో ఈ పథకాన్ని ఆయన ప్రారంభించారు. ప్రభుత్వం వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతి వృత్తిదారులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. పనిముట్ల కొనుగోలు, ఆధునికీకరణ, ముడిసరుకు కొనుగోలుకు సాయం చేస్తోంది. ఇదో నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే శనివారం నుంచి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని రాష్ట్రవ్యాప్తంగా అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,28,862 దరఖాస్తులు అందాయి. బీసీ-ఏ నుంచి 2,66,001 దరఖాస్తులు అందగా.. బీసీ-బీ నుంచి 1,85,136.. బీసీ-డీ నుంచి 65,310.. ఎంబీసీల నుంచి 12,415 దరఖాస్తులు అందాయి. ప్రతి నెలా 5లోగా వెరిఫికేషన్‌ పూర్తవనుంది. అదే నెల 15న ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి ఆర్థిక సాయం అందజేస్తున్నారు. జూలై 18 నుంచి మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్‌ మొదలవ్వనుంది. ఇక, లక్ష రూపాయల ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారులు తాము కొన్న పనిముట్లు లేదా ముడిసరుకుకు సంబంధించిన ఫొటోలను 30 రోజుల్లోగా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.

వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతి వృత్తిదారులకు ఆర్థిక సాయం పథకంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. బీసీ కులవృత్తులు, చేతివృత్తిదారుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.లక్ష ఆర్థిక సాయం పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆశయాన్ని నెరవేర్చాలని పిలుపునిచ్చారు. మరి, బీసీల కోసం ప్రభుత్వం రూ. లక్ష సాయం అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.