iDreamPost

వరద బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

వరద బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. కేసీఆర్ అధ్యక్షతన సాగిన ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలన నిర్ణయారు తీసుకుంది. ముఖ్యంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం. రూ.60 వేల కోట్లతో హైదరాబాద్ మెట్రోని విస్తరించడంపై నిర్ణయం తీసుకున్నారు. రాబోయే నాలుగేళ్లలో మెట్రో విస్తరణ పనులు పూర్తి కావాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. అంతేకాకుండా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో వరదలు వచ్చిన విషయం తెలిసిందే. వరదలపై కూడా కేబినెట్ చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

తెలంగాణ కేబినెట్ సమావేశం దాదాపు 5 గంటలపాటు కొనసాగింది. సమావేశం ముగిసిన తర్వాత కేబినెట్ నిర్ణయాలను పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఇటీవల వచ్చిన వరదల గురించి కేబినెట్ కూలంకషంగా చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వర్షాల కారణంగా మొత్తం 10 జిల్లాల్లో వరద నష్టం జరిగినట్లు మంత్రి తెలిపారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తక్షణ సహాయ చర్యల కోసం రూ.500 కోట్లు నిధులు విడుదల చేసినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వరదల వల్ల ప్రభావితమైన 27వేల మందికి వెంటనే పునరావాస ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇప్పటికే సాగు మొదలుపెట్టిన నేపథ్యంలో వ్యవసాయ శాఖ రైతులకు సాహాయకారిగా ఉండాలని సూచించారు. వరదల కారణంగా 40 మందికి పైగా మరణించారని కేటీఆర్ తెలిపారు. వారందరి నివేదికను సిద్ధం చేసి వెంటనే పరిహారం అందేలా చూడాలని అధికారులను ఆదేశాలు జారీ చేశామన్నారు. వరదల్లో ప్రాణాలను లెక్కచేయకుండా సేవలు అందించిన ఇద్దరు విద్యుత్ ఉద్యోగులకు ఆగస్టు 15న ప్రభుత్వం తరఫున సత్కారం చేయనున్నట్లు తెలిపారు. భవిష్యత్ లో రాబోయే వరదల దృష్ట్యా మున్నేరు వాగు వెంబడి రిటైనింగ్ వాల్ నిర్మించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకున్న విషయాన్ని కేటీఆర్ వెల్లడించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. త్వరలోనే ఒక కమిటీని నియమించి విలీనానికి సంబంధించి విధి విధానాలను సిద్ధం చేస్తామన్నారు. 43,373 మంది ఆర్టీసీ ఉద్యోగులు అంతా ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్నారు. అలాగే మెట్రో విషయంలో కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.60 వేల కోట్లతో మెట్రో విస్తరణ పనులు చేపట్టున్న విషయాన్ని వెల్లడించారు. అది కూడా వచ్చే మూడు, నాలుగేళ్లలోనే పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న విషయాన్న తెలియజేశారు. ప్రస్తుతం ఉన్న 70 కిలోమీటర్లు, విమానాశ్రయం వరకు రాబోతున్న 31 కిలో మీటర్లకు అదనంగా మరిన్ని కొత్త రూట్లలో మెట్రో నిర్మాణం చేపట్టున్నట్లు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి