iDreamPost

జీవన శైలి మారిపోయింది..

జీవన శైలి మారిపోయింది..

ఒకప్పుడు రోట్లో పచ్చడి రుబ్బితేగానీ చట్నీ తినని స్థాయి నుంచి గ్రైండర్‌లకు అలవాటు పడిపోయాం. ఇదే రీతిలో దాదాపు అన్ని పనుల్లోనూ సౌలభ్యం, సౌకర్యం చోటు చేసుకుంది. దీని కారణంగా అనారోగ్యాలు చుట్టుముడుతున్నాయని కొందరు గగ్గోలు పెడుతున్నప్పటికీ ఈ వేగవంతమైన కాలంలో ఆధునిక వస్తువుల సేవలను వినియోగించుకోకపోతే రోజువారీ జీవితం సక్రమంగా ముందుకు నడవడం కష్టపోకమానదు.

అయితే ఇలా ఆధునిక వస్తువులు మన జీవితంలోకి అంచలంచెలుగానే ప్రవేశించాయి. కానీ కరోనా కారణంగా ఈ మార్పు చాలా వేగంగానే చోటు చేసుకుంటోందని చెబుతున్న సామాజిక పరిశీలకులు. ఒకప్పుడు సామూహికంగాను, జనం మధ్యన ఉండాలని కోరుకునే వాళ్ళలో చాలా మంది ఇప్పుడు తమ ఇంటికే పరిమితమైపోతున్న పరిస్థితిని అందరూ చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో జన సమూహాలకు దూరంగా ఉండేందుకు తోడ్పడే వివిద పరికరాలు ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేరిపోయాయి. ఈ కోవకిచెందినదే సెల్‌ఫోన్, వాషింగ్‌ మెషిన్, డిష్‌వాషర్, హోమ్‌ ధియేటర్‌లు.. తదితర వస్తువులు చేరతాయి. సెల్‌ఫోన్‌ అవసరం పెరిగిపోవడంతో ఈ సారి జరిగిన పండుగ సీజన్‌లో దాదాపు అయిదున్నర కోట్లకుపైగా ఫోన్లను జనం కొనేసారని నివేదికలు తేల్చాయి. సినిమా ధియేటర్‌లకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో హోమ్‌ ధియేటర్‌లు, పెద్ద స్క్రీన్‌ ఉన్న టీవీల కొనుగోళ్ళు కూడా పెరిగాయట. వర్క్‌ఫ్రం హోమ్‌ కూడా అత్యవసరం కావడంతో లాప్‌టాప్‌ల అమ్మకాలు జోరందుకున్నాయని నివేదికలు చెబుతున్నాయి.

ఈ నివేదికలను పరిశీలిస్తే గత 30, 40 ఏళ్ళలో జన సామాన్యంలో వచ్చిన మార్పులన్నీ కేవలం 2020లోనే వచ్చేసినట్టుగా అన్పించకమానదు. సేఫ్‌గా బ్రతకడానికి అవసరమైన వాటిని గుర్తించి ఆ దిశగా జనం మళ్ళుతున్నట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. అలాగే ఖర్చుల విషయంలో కూడా కార్పొరేట్‌ కంపెనీల నుంచి సామాన్య మానవుల వరకు ఆచితూచి ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.

జీవన వ్యయాలు పెరిగిపోవడం సామాన్యుడికి, నిర్వహణ ఖర్చుల భారం కార్పొరేట్‌ కంపెనీలకు తప్పడం లేదు. వచ్చే ఆర్ధిక సంవత్సరం వరకు కూడా ఇప్పుడున్న ఆర్ధిక పరిస్థితే కొనసాగతుందని, ఆ తరువాత ఊపందుకుంటుని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇరవై శాతానికిపైగా వ్యతిరేక ఫలితాలు నమోదైన జీడీపీ వచ్చే ఆర్ధిక సంవత్సరానికి గానీ కోలుకునేందుకు అవకాశం లేదని తేల్చేస్తున్నారు. ఒక వేళ నిపుణుల అంచనాలే కరెక్ట్‌ అయితే.. జనం ఆదాయాలు పెరిగితే జీవనానికి అవసరమైన మరింత ఆధునిక వసతులవైపు మొగ్గు చూపేందుకు అవకాశాలు మరింతగా పెరిగిపోతాయంటున్నారు.

కాగా తోటి మనుషులకు దూరం జరిగే విధంగా ఏర్పడే మార్పుల ఫలితాలు సామాజికంగా తీవ్ర ప్రభావాలనే చూపిస్తాయని కొందరు సామాజికవాదులు గగ్గోలు పెడుతున్నారు. అయినప్పటికీ ప్రజల జీవనంలో వస్తున్న ఈ వేగవంతమైన మార్పులు మాత్రం రాకెడ్‌ స్పీడుతోనే జొరబడిపోతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి