iDreamPost

IND vs AUS: ఆసీస్ తో మ్యాచ్.. టీమిండియా విజయానికి 3 ప్రధాన కారణాలు!

  • Author Soma Sekhar Published - 08:33 AM, Sat - 2 December 23

కంగారూ జట్టుతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో భారత విజయానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

కంగారూ జట్టుతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో కైవసం చేసుకుంది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో భారత విజయానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

  • Author Soma Sekhar Published - 08:33 AM, Sat - 2 December 23
IND vs AUS: ఆసీస్ తో మ్యాచ్.. టీమిండియా విజయానికి 3 ప్రధాన కారణాలు!

సొంతగడ్డపై ఆస్ట్రేలియా చేతిలో వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయిన భారత్.. దానికి కొద్దిరోజుల్లోనే ప్రతీకారం తీర్చుకుంది. కంగారూ జట్టుతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 3-1తో కైవసం చేసుకుంది. నిర్ణయాత్మకమైన ఈ మ్యాచ్ 20 పరుగులతో ఆసీస్ ను చిత్తుచేసింది. బౌలర్లు, బ్యాటర్లు సమష్టిగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు. గత మ్యాచ్ లతో పోలిస్తే ఈ పోరు భిన్నంగా సాగింది. ఇరు జట్ల బ్యాటర్లలో ఒక్కరు కూడా అర్దశతకం సాధించలేకపోవడం గమనార్హం. ఇక టీమిండియా విజయానికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టీ20లో సూర్యకుమార్ సేన 20 పరుగులతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ టీమ్ ను భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్లు కోల్పోయి 154 పరుగులకే పరిమితం అయ్యింది. జట్టులో కెప్టెన్ మాథ్యూ వేడ్ 36* పరుగులతో రాణించగా.. వరల్డ్ కప్ ఫైనల్ హీరో ట్రావిస్ హెడ్ 31 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, దీపక్ చహర్ 2 వికెట్లు తీశారు. టీమిండియా, ఆసీస్ జట్లు చెరో నాలుగు మార్పులుతో బరిలోకి దిగాయి.

1. అక్షర్ పటేల్ బౌలింగ్

గత మ్యాచ్ ల్లో టీమిండియా బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం అద్భుతంగా కమ్ బ్యాక్ అయ్యారు. మరీ ముఖ్యంగా స్టార్ స్పిన్నర్ అక్షర్ పటేల్ ఆసీస్ ను గట్టి దెబ్బతీశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. కాగా.. ఆస్ట్రేలియా తన లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది. కేవలం 3 ఓవర్లలోనే 40 పరుగులు చేసి భారత బౌలర్లపై ఒత్తడిని తీసుకొచ్చింది. అయితే ఒపెనర్ ఫిలిప్(8)ను రవి బిష్ణోయ్ అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ త్రూ అందించాడు. ఇక ఆ తర్వాత రెచ్చిపోయాడు అక్షర్ పటేల్. కట్టుదిట్టమైన బంతులు వేస్తూ.. ట్రావిస్ హెడ్, మెక్ డెర్మాట్, హార్డి వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఆసీస్ ను కష్టాల్లోకి నెట్టాడు. అక్షర్ ఒత్తిడితో పరుగుల వేగం తగ్గింది.

2. రింకూ-జితేశ్ బ్యాటింగ్

జైస్వాల్-రుతురాజ్ జోడీ బ్యాటింగ్ ఆరంభించిన విధానం చూస్తే.. టీమిండియా ఈ మ్యాచ్ లో కూడా భారీ స్కోర్ సాధించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ 6 ఓవర్లలో తొలి వికెట్ కు 50 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్(37) పెవిలియన్ కు చేరాడు. ఇక ఇప్పటి నుంచి భారత బ్యాటర్లు తడబడ్డారు. జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన శ్రేయస్ అయ్యర్(8), కెప్టెన్ సూర్య కుమార్(1)లతో పాటుగా కొద్దిసేపు పోరాడిన రుతురాజ్(32) కూడా పెవిలియన్ చేరాడు. అప్పటికి జట్టు స్కోరు 13. 2 ఓవర్లలో 111/4 గా ఉంది. ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన జితేశ్ కుమార్ అప్పటికే క్రీజ్ లో ఉన్న రింకూ సింగ్ కు జత కలిశాడు. వీరిద్దరు ఉన్నంత సేపు బ్యాట్ ఝుళిపించారు. మరీ ముఖ్యంగా జితేశ్ రింకూను డామినేట్ చేశాడు. అతడు కేవలం 19 బంతుల్లోనే 3 సిక్సర్లు, ఓ ఫోర్ తో చకచకా 35 పరుగులు చేశాడు. మరో వైపు రింకూ కూడా తనదైన శైలిలో చెలరేగిపోయాడు. 29 బంతుల్లో 4 ఫోర్లు,2 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. వీరిద్దరి బ్యాటింగ్ కారణంగానే టీమిండియా ఆ మాత్రం స్కోర్ చేయగలింది. వీరిద్దరి తర్వాత వచ్చిన ఏ ఒక్క బ్యాటర్ కూడా షాట్స్ ఆడలేదు. దీంతో ఆఖరి 8 బంతుల వ్యవధిలోనే 5 వికెట్లు కోల్పోయింది.

3. టీమ్ ఎఫర్ట్

సమష్టి తత్వం.. ఎలాంటి సమస్యనైనా ఓడిస్తుంది. ఆసీస్ తో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో టీమిండియా టీమ్ ఎఫర్ట్ తో విజయం సాధించింది. బ్యాటింగ్ లో నలుగు ఆటగాళ్లు రాణించారు. జైస్వాల్, గత మ్యాచ్ లో సెంచరీ హీరో రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, యంగ్ హిట్టర్ జితేశ్ కుమార్ లు ధాటిగా ఆడి భారత్ కు మెరుగైన స్కోర్ అందించారు. ఇక ఆ తర్వాత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి ఆసీస్ టీమ్ ను కట్టడి చేశారు. గత మూడు మ్యాచ్ లో దారుణంగా విఫలం అయ్యి.. ధారాళంగా పరుగులు సమర్పించుకున్న టీమిండియా బౌలర్లు ఈ మ్యాచ్ లో రాణించారు. ఈ మ్యాచ్ తో జట్టులోకి వచ్చిన దీపక్ చహర్ పరుగులు ఇచ్చినప్పటికీ.. వరుస ఓవర్లలోనే టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్ ల వికెట్లు తీసి ఆసీస్ ను ఒత్తిడిలోకి నెట్టాడు. అక్షర్ పటేల్ అద్భుతమైన బౌలింగ్ తో మ్యాచ్ విన్నర్ పాత్ర పోషించాడు. కేవలం 16 రన్స్ మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. మరి టీమిండియా ఈ విజయంతో సిరీస్ కైవసం చేసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి