iDreamPost

అననేలా.. అనిపించుకోనేల!

అననేలా.. అనిపించుకోనేల!

సరైన కారణం లేకుండా ఎదుటి వారిని ఏదైనా మాట అనేస్తే.. ఆ తరువాత వాళ్ళు రియాక్టయి మనల్ని ఇంకో మాట అంటే మనస్సు పీకుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ‘‘అననేల.. అనిపించుకోనేల’’ అంటూ పెద్దలు సర్ధిచెబుతూ ఉంటారు. ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి అలా సర్దిచెప్పాల్సిన పరిస్థితి ఎదురైందంటున్నారు ఆయన అభిమానులు.

రాష్ట్రంలో ఏం జరిగినా అందుకు సీయం వైఎస్‌ జగన్, లేదా ఆయన ప్రభుత్వంలోని బృందం అంటూ గొంతిచ్చుకు పడిపోవడం చంద్రబాబుకు ఇటీవలి కాలంలో మా బాగా అలవాటైపోయిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే జడ్జి రామకృష్ణ తమ్ముడిపై జరిగిన దాడి విషయాన్ని ప్రభుత్వానికి ఆపాదిస్తూ ట్వీట్లు, కామెంట్లు, లేఖల యుద్దాన్ని ప్రకటించేసారు. అందులో భాగంగా నేరుగా ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌కి లేఖరాసేసారు. అయితే ఈ లేఖపై సవాంగ్‌ కూడా ధీటుగానే సమాధానమివ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.

మీ వద్ద ఏమైనా ఆధారాలుంటే సీల్డు కవర్‌లో పంపిస్తే విచారణ జరుపుతాం.. అంతే గానీ బహిరంగ లేఖల రూపంలో చెప్పడం భావ్యం కాదు అంటూ సుతిమెత్తగానే చురకలంటించేసారు. అననేల.. అనిపించుకోనేల అన్న సామెతను ఇక్కడే గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.

మూడు సార్లు రాష్ట్ర సీయంగాను, ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగాను ఉన్న వ్యక్తి నుంచి దిగజారుడు స్థాయి విమర్శలను ఎవ్వరూ ఊహించరు. కానీ రాజకీయాలే పరమ ధ్యేయంగా పెట్టుకున్న చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకునే విధంగా వ్యవహరిస్తున్నారన్నది విమర్శలు అభిప్రాయపడుతున్నారు. ఇందుకు గతంలో పలు సంఘటనలను దీనికి ఉదాహరణలుగా చూపుతున్నారు.

ఆధారాలు ఉంటే అందజేయండి అంటూ డీజీపీ వినమ్రపూర్వకంగా కోరిన కోరికను మన్నించి సదరు ఆధారాలు అందజేయాల్సిన బాధ్యత దేశంలోనే సీనియర్‌ రాజకీయ నాయకుడు చంద్రబాబుపై పడిందంటున్నారు. ఒక వేళ ఇవ్వలేక పోతే మరోసారి బొప్పికట్టించుకున్నట్టువుతుందంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఏదో ఒక రంధ్రాన్ని అన్వేషించి చంద్రబాబుకు అనుకూలంగా డప్పుకొట్టేందుకు పక్షపాత మీడియా ఉండనే ఉంది కనుక ఇటువంటి పరిస్థితి నుంచి సులభంగానే బాబు బైటపడిపోతారని కూడా అంటున్నారు. అయితే జనంలో పలుచనయ్యే పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కొంటారన్నదే ఇక్కడి ప్రధాన ప్రశ్న.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి