iDreamPost

పోలవరంతో వైఎస్సార్‌కు సంబంధంలేదట..!!

పోలవరంతో వైఎస్సార్‌కు సంబంధంలేదట..!!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణించి 11 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆయనపై అక్కసు వెళ్లగక్కుతున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. వైఎస్‌ వ్యక్తిత్వాన్ని, ఆయన ఉన్నతిని తగ్గించేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాజాగా టీడీపీ సీనియర్‌ నేత, మండలిలో ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు వైఎస్‌ఆర్‌పై తన అక్కను వెళ్లగక్కారు.

పోలవరం ప్రాజెక్టుతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఎంత మాత్రం సంబంధంలేదట. వైఎస్సార్‌ కేవలం కాల్వలు మాత్రమే తవించారట. అవి కూడా పూర్తి చేయలేకపోయారట. అదీ కమిషన్ల కోసమే కాల్వలను తవ్వించారంటూ యనమల అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఇంతకీ యనమలకు వైఎస్సార్‌ ఇప్పుడు ఎందుకు గుర్తుకు వచ్చారంటే… పోలవరం ప్రాజెక్టు వద్ద వైఎస్సార్‌ 100 అడుగుల విగ్రహం పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది యనమలకు ఏ మాత్రం రుచించడం లేదు. అందుకే తనదైన శైలిలో అసత్యాలు చెబుతూ వైఎస్సార్‌పై అక్కసును బయటపెట్టుకున్నారు.

వైఎస్‌ విగ్రహం ఏర్పాటు చేయాలనుకుంటే.. పోలవరం కాలువల వద్ద పెట్టుకోవాలని కూడా యనమల ఉచిత సలహా ఒకటి ఇచ్చారు. అదీ కూడా ప్రజాధనంతో కాకుండా.. జగన్‌ తన సొంత డబ్బుతో పెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద అంజయ్య, ఎన్‌టీఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డి, చంద్రబాబు విగ్రహాలు పెట్టాలని ఓ వరస క్రమంలో పేర్లు చెబుతూ డిమాండ్‌ చేశారు.

శంకుస్థాపనలకే పరిమితమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పట్టాలెక్కించింది ఎవరో మీడియా, రాజకీయ నాయకులకే కాదు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు అందరకీ తెలుసు. ప్రాజెక్టు డీపీఆర్‌ సిద్ధం చేయడం, నిధులు, పర్యావరణ, అటవీ వంటి కీలకమైన అనుమతులను వైఎస్‌ తెచ్చారు. ప్రాజెక్టు నిర్మాణం అంటే.. అన్ని పనులు సమాంతరంగా చేయడమే. పోలవరంలో డ్యాం కన్నా కాలవల నిర్మాణమే పెద్ద పని, విజయవాడ వరకు కుడికాల్వ, విశాఖ వరకు ఎడమ కాల్వను తవ్వాలి. ఇందుకు వేలాది రైతులను ఒప్పించి భూ సేకరణ చేయాలి. ఆ పనిని రైతులను ఒప్పించి వైఎస్‌ చేశారు. కాలువలను దాదాపు పూర్తి చేయడమే కాదు వాటికి రివిట్‌మెంట్‌ కూడా చేయించారు. ఈ పనిని అడ్డుకునేందుకు పశ్చిమ గోదావరి జిల్లాలోని టీడీపీ సానుభూతి రైతుల చేత పరిహారంపై టీడీపీ కోర్టుల్లో పిటిషన్లు వేయించింది. రాష్ట్ర విభజన తర్వాత గత టీడీపీ ప్రభుత్వంలో ఆ రైతులకు ఎకరాకు 50 నుంచి 60 లక్షల పరిహారం ఇచ్చారు. పశ్చిమ గోదావరిలో ఇచ్చిన పరిహారమే తమకు ఇవ్వాలని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయిన రైతులు కోర్టులను 2017లో ఆశ్రయించిన విషయం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన యనమలకు తెలియదనుకోవడం పొరపాటు అవుతుంది.

కాలువల్లో పిచ్చిచెట్టు మొలిస్తే.. వాటిని తొలగించి పట్టిసీమ ద్వారా నీళ్లు ఇచ్చామని కూడా యనమల మాట్లాడారు. కాల్వలు లేకపోతే పట్టిసీమ ద్వారా నీళ్లు కృష్ణా నదికి వస్తాయా..? అనే ప్రాథమిక జ్ఞానం తన మాటలు వినేవారికి లేదనుకునేలా యనమల వ్యాఖ్యలుండడం విడ్డూరంగా ఉంది.

విగ్రహాలు ఏర్పాటు చేయాలంటూ.. వరస క్రమంలో మాజీ ముఖ్యమంత్రుల పేర్లు చెప్పిన యనమల.. ఆ వరుస క్రమం తప్పించారు. అంజయ్య, ఎన్‌టీఆర్‌ తర్వాత చంద్రబాబు రావాల్సి ఉండగా.. రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డిల తర్వాత చంద్రబాబు పేరు చెప్పారు. రోశయ్య, కిరణ్‌కుమార్‌ రెడ్డిలకు ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా పని చేశారా..? లేదా..? అంటే 9 ఏళ్లపాటు చేశారని విషయం అందరికీ తెలిసిన విషయమే. వరుస క్రమంలో చంద్రబాబు పేరును చివరలో చెప్పడం వెనుక కారణం.. ఆ 9 ఏళ్లలో చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై కనీసం ఆలోచన కూడా చేయలేదని యనమల తన వ్యాఖ్యల ద్వారా ఒప్పుకున్నారు.

వైఎస్సార్‌పై తన అక్కసు వెళ్లగక్కే సమయంలో ఏడు పదుల వయస్సు ఉన్న యనమల విచక్షణ కోల్పోయినట్లుగా ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థం అవుతోంది. చనిపోయిన వారి విగ్రహాలనే ఏర్పాటు చేయడం సాంప్రదాయం. బతికి ఉన్న వారి విగ్రహాలు పెట్టుకోవడం అశుభం అంటారు. వైఎస్‌పై తన కడుపు మంటను చాటుకునే సమయంలో మేధావి అయిన యనమలకు ఇవేమీ గుర్తుకురాకపోవడం విశేషం. బతికి ఉన్న రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల విగ్రహాలను పోలవరం ప్రాజెక్టు వద్ద పెట్టాలని కోరడం కాదు.. ఏకంగా డిమాండ్‌ చేసి వార్తల్లో నిలిచారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి