iDreamPost

వైఎస్ అనుచరుడు సూరీడు, పోలీసు అధికారులపై కేసు

వైఎస్ అనుచరుడు సూరీడు, పోలీసు అధికారులపై కేసు

తెలుగు రాష్ట్రాలను ఏలిన గొప్ప నేతల్లో ఒకరు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తండ్రి అన్న విషయం అందరికీ తెలిసిందే. రాజశేఖర్ రెడ్డి ఎంతటి ప్రజా నేత అందరికీ తెలుసు. ఆయన పాలనను చూసి ఉమ్మడి ఏపీ ప్రజలు రెండవ సారి కూడా ముఖ్యమంత్రిగా పట్టం కట్టారు. కానీ విమాన ప్రమాదంలో ఆ మహా నేత మరణించారు.  ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సహాయకుడిగా, తోడు నీడగా నిలిచిన సూరీడు గుర్తున్నాడు కదా. వైఎస్ ఎక్కడకు వెళ్లినా, ఏ సమావేశంలో మాట్లాడినా.. ఆయన వెనుకే ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక ఆయన గురించి ఎవ్వరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు ఓ కేసు నమోదై మరోసారి వార్తల్లో నిలిచారు. సూరీడు పూర్తి పేరు ఎర్రం రెడ్డి సూర్యనారాయణ రెడ్డి.

సొంత అల్లుడిపై దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సూరీడు కుమార్తెను .. కడపకు చెందిన పోతిరెడ్డి సురేందర్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే భార్యా భర్తల మధ్య గొడవలు జరగడంతో.. వరకట్న వేధింపుల కింద భర్తపై ఫిర్యాదు చేసింది. దీంతో సూరీడు అల్లుడిపై కేసు నమోదైంది. కాగా, 2021లో మార్చి 23న రాత్రి భార్యతో మాట్లాడేందుకు జూబ్లీహిల్స్ లోని తన మామ సూరీడు ఇంటికి వెళ్లాడు అల్లుడు సురేందర్ రెడ్డి. ఆ సమయంలో మామా,అల్లుళ్ల మధ్య గొడవ జరిగింది. అల్లుడిపై సూరీడు దాడి చేయడంతో.. సమాచారం అందుకున్న పోలీసులు సురేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.

తన ఇంట్లోకి దౌర్జన్యంగా రావడంతో పాటు తనపై దాడి చేశాడంటూ సూరీడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. అప్పుడు జరిగిన గొడవపై ఇప్పుడు అల్లుడు కోర్టు మెట్టేక్కాడు. ఆ గొడవ జరిగిన సమయంలో జూబ్లీహిల్స్ సీఐ రాజ శేఖర్ రెడ్డి, ఎస్సై నరేష్ లు, ప్రస్తుతం ఏపీలో ఐజీగా పనిచేస్తున్న ఓ అధికారితో కలిసి తనను అక్రమంగా నిర్బంధించి, దాడికి పాల్పడ్డారని సురేందర్ రెడ్డి ఆరోపిస్తూ.. కోర్టును ఆశ్రయించారు. తనపై తప్పుడు కేసులు పెట్టారని, తన మామ సూరీడు, ఆ పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు. కోర్టు ఇచ్చిన ఆదేశాలతో సూరీడుతో పాటు ఆ పోలీసు అధికారులపై కేసు నమోదైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి