iDreamPost

ఉలుకెందుకు యనమల..?

ఉలుకెందుకు యనమల..?

గుమ్మడికాయల దొంగ ఎవరంటే.. భుజాలు తడుముకున్నట్లుగా ఉంది టీడీపీ సీనియర్‌ నేత, మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడి వ్యవహారం. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పేరుతో హల్‌చల్‌ చేసిన లేఖ నిన్న, ఈ రోజు మీడియాలో సృష్టించిన రాజకీయ దుమారం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ లేఖ తాను రాయలేదని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఈ రోజు జాతీయ వార్త ఛానెల్‌ ఏఎన్‌ఐకి చెప్పారు. మరో వైపు ఈ విషయంపై సీరియస్‌గా దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో యనమల భుజాలు తడుముకుంటున్నారు. కరోనా వైరస్‌ కట్టడిపై చర్యలు తీసుకోకుండా.. లేఖపై విచారణ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సీఎం జగన్‌ను ప్రశ్నిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాసిన లేఖంటూ.. ఒకటి నిన్న మీడియాలో హల్‌ చల్‌ చేసింది. తనకు, తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కేంద్రాన్ని కోరారు. దీంతోపాటు స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీలు అధిక శాతం ఏకగ్రీవం అయ్యాయని, ఎన్నికలను కేంద్ర బలగాలతో జరిపించాలంటూ కూడా ఆ లేఖలో పేర్కొన్నారు. మొత్తం మీద రమేష్‌కుమార్‌ భద్రత, స్థానిక సంస్థల ఎన్నికలు అంశాలుగా మూడు పేజీల లేఖ రాజకీయ దుమారాన్ని సృష్టించింది. ఆ లేఖ మీడియా సంస్థలకు వద్ద ప్రత్యక్షమవడం, దానిపై టీవీల్లో బ్రేకింగ్‌లు న్యూస్‌లు, టిబేట్లు విరివిగా జరిగాయి. పేపర్లు కూడా ప్రధానంగా అచ్చెశాయి. ఆఖరున కమిషనర్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌ ఆ లేఖ తాను రాసినట్లు దృవీకరించలేదని ముక్తాయించి జర్నలిజాన్ని కొత్త పుంతలు తొక్కించాయి.

ఎస్‌ఈసీ క్లారిటీ..

ఈ రోజు ఉదయం నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఆ లేఖపై జాతీయ వార్త ఛానెల్‌కు క్లారిటీ ఇచ్చారు. ఆ లేఖ తాను రాయలేదని ఏఎన్‌ఐకి చెప్పారు. ఏమైనా.. ఆ లేఖ వల్ల పెద్ద రాజకీయ దుమారమే రేగింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాల్జేసేందుకు ఆ లేఖను ఆయుధంగా వాడుకున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ పని ఎవరు చేశారు..? అనేది ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

ఆ సాహసం ఎవరు చేసుంటారు..?

స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా అంశంపై ఎస్‌ఈసీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నెలకొన్న భేదాభిప్రాయాన్ని ఆసరాగా తీసుకుని ఆ లేఖ రాజకీయం నడిపారని అర్థమవుతోంది. ఎస్‌ఈసీ పేరుతో లేఖ రాసి, ప్రభుత్వానికి చెడ్డపేరు పేరు తేచ్చే అవసరం ఎవరికుంటుంది..? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై సీరియస్‌గా ఉంది. సీఎం జగన్‌ రాష్ట్ర డీజీపీ, ఇంటిలిజెన్స్‌ చీఫ్‌లతో భేటీ అయ్యారు. లేఖ ఎవరు రాశారన్న విషయం తేల్చాలని ఆదేశాలు జారీ చేయడంతో యనమల హడావుడిగా మీడియా ముందుకొచ్చారు.

ఆ లేఖ ఎస్‌ఈసీ రాశారంటున్న యనమల..

మీడియా, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున లేఖ తాను రాయలేదని ఈ రోజు ఎస్‌ఈసీ రమేష్‌కుమార్‌ క్లారిటీ ఇచ్చారు. అయినా యనమల మాత్రం ఆ లేఖ ఎస్‌ఈసీనే రాశారని చెబుతున్నారు. ఎస్‌ఈసీ తాను రాయలేదంటుంటే.. కాదు ఆయనే రాశారని యనమల ఎలా చెబుతారన్నదే ఇక్కడ ప్రశ్న. యనమల ఇలా మాట్లాడడంతోనే అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ లేఖ వ్యవహారం ఎవరి మెడకు చుట్టుకుంటుందో మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. సీఎం ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు కాబట్టి లేఖ వీరుల గుట్టురట్టవడం ఖాయంగా కనిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి