iDreamPost

వారే ఓట్లు వేసి ఉంటే 150 సీట్లు మాకే వచ్చేవి..! టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత

వారే ఓట్లు వేసి ఉంటే 150 సీట్లు మాకే వచ్చేవి..! టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత

గత సాధారణ ఎన్నికల్లో ఘోర ఓటమి కి గల కారణాలను ఇప్పటికీ అన్వేషిస్తున్నారు టిడిపి నేతలు. నిన్న మద్యం దుకాణాల వద్ద బారులు తీరిన వారందరూ టిడిపికి ఓట్లు వేసి ఉంటే 150 సీట్లు తమకే వచ్చేవని అన్నారు టిడిపి మహిళా అధ్యక్షురాలు అనిత. మంత్రి పేర్ని నాని విమర్శలకు కౌంటర్ ఇచ్చినట్లుగా ఉన్నా.. అనిత మాటల్లో అర్ధం వేరుగా ఉంది.

తమ ప్రభుత్వంలో మందుబాబులకు తాము ఎంతో చేసినా.. వాళ్ళు ఓట్లు వేయలేదనే బాధ అనిత మాటల్లో స్పష్టంగా కనిపిస్తోంది మద్యం ప్రియుల కోసం చంద్రబాబు ప్రభుత్వం ఎంత మేలు చేసింది మాటల్లో చెప్పలేం. నెవర్ బిఫోర్..ఎవర్ ఆఫ్టర్ అన్న రీతిలో మందుబాబులకు సదుపాయాలు కల్పించింది. రకరకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచింది. సౌకర్యవంతంగా కూర్చుని.. సరదాగా నాలుగు పెగ్గులు తాగేందుకు అవకాశం లేకపోవడంతో పర్మిట్ రూమ్ విశాలంగా ఏర్పాటు చేసింది. అప్పటివరకూ పర్మిట్ రూమ్ 15 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండాలన్న నిబంధన కాస్త పక్కన పెట్టి.. ఎక్కడైనా సరే పర్మిట్ రూమ్ 50 చదరపు అడుగులు.. ఆపై మాత్రమే ఉండాలని ఏకంగా జీఓ జారీ చేసింది.

సౌకర్యవంతంగా కుర్చీలు, టేబుళ్లు.. పర్మిట్ రూమ్ వద్దే మంచింగ్ అందుబాటులో పెట్టింది. మందు తాగాలి అనే కోరిక ఎప్పుడు కలిగితే అప్పుడు మద్యం అందుబాటులో ఉండేలా బెల్టుషాపులను వీధి వీధికి.. సందు గొందుల్లో తెరిచింది. చుక్క కోసం మందుబాబులు చిక్కులు పడకుండా వారి వద్దకే మొబైల్ బెల్టు షాపుల ద్వారా మద్యం సరఫరా చేసింది.

తెల్లవారుజామున టి అంగళ్ళు తెరుచుకునే లోపే దుకాణాలు తెరిచే విధంగా వెసులుబాటు కల్పించింది. రాత్రి 10 గంటలకు భోజనం హోటల్ లో మూసేసినా..అర్ధరాత్రి ఒంటిగంట వరకు మద్యం దుకాణాలు మాత్రం తెరిచి ఉంచి మందు బాబుల మనసెరిగి చంద్రబాబు ప్రభుత్వం నడుచుకుంది. ఇంత చేసినా తమ ప్రభుత్వానికి మందుబాబులు ఓట్లు వేయలేదనేేదే అనిత బాధ గా తెలుస్తోంది. అందుకే కాబోలు సందర్భం వచ్చింది కాబట్టి మందు బాబులు తమ పార్టీ కి చేసిన అన్యాయాన్ని అనిత ఏకరువు పెట్టారు పాపం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి