iDreamPost

టిడిపి ప్రజా బ్యాలెట్‌ … రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారా..?

టిడిపి ప్రజా బ్యాలెట్‌ … రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తారా..?

టీడీపీ నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్రలో భాగంగా మూడు రాజధానులపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహించి జగన్‌ చేస్తున్న అరాచకాన్ని ప్రజలకు వివరిస్తామని టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌లు ప్రటించారు. నిన్న మొన్నటి వరకు మూడు రాజధానులపై రెఫరెండం నిర్వహించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. అయితే దాని విధి విధానాలేమిటో వెల్లడించలేదు. ప్రభుత్వం నుంచి స్పందన లేదు. ఆ తర్వాత ఆ విషయాన్ని ఆయన పక్కబెట్టేశారని అందరూ అనుకున్నారు. కానీ దానిని ఇలా ప్రజా బ్యాలెట్‌ రూపంలో అమలు చేస్తుండడం అభినందనీయమని విశ్లేషకులు కొనియాడుతున్నారు.

మూడు రాజధానులతో రాష్ట్రం సమతుల అభివృద్ధి జరుగుతుందని వైఎస్సార్‌సీపీ.. కాదు కాదు అమరావతి ఒక్కటే రాజధానిగా ఉంటేనే రాష్ట్ర భవిష్యత్‌ బాగుంటుందని టీడీపీ.. వాదించుకుంటున్నాయి. ఎవరికి వారు తమ కార్యకర్తలతో రాష్ట్రంలో తమకు బలమైన ప్రాంతాల్లో ర్యాలీ చేశారు. టీడీపీ చాలా తక్కువ ప్రాంతాల్లో అమరావతి అనుకూల కార్యక్రమం చేసింది. అధికార వైఎస్సార్‌సీపీ ఎక్కువ చోట్ల చేసింది. అదే ఇరు పార్టీల మధ్య వ్యత్యాసం. పార్టీలు, వాటి కార్యకర్తలతో సంబంధం లేకుండా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారో ఇప్పటికీ ఎవరికీ పెద్దగా తెలియదు. ఈ రోజు నుంచి టీడీపీ చేపడుతున్న ప్రజా బ్యాలెట్‌ ద్వారా ప్రజల నాడి ఏమిటో తెలుస్తుంది.

మూడు రాజధానులపై ప్రజా బ్యాలెట్‌ నిర్వహించి జగన్‌ చేస్తున్న అరాచకాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తామని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు కాబట్టి మూడు రాజధానులా..? ఒకే రాజధానా..? ప్రజలేమనుకుంటారో మరో మూడు రోజుల్లో తెలిపోతుంది. ఈ ప్రజా బ్యాలెట్‌ ఎక్కడ నిర్వహిసారు..? ఉద్యమం జరుగుతున్న అమరావతి ప్రాంతంలోని గ్రామాల్లో మాత్రమే నిర్వహిస్తారా..? గుంటూరు, కృష్ణా జిల్లాలకే పరిమితం చేస్తారా..? అమరావతి అందరిదీ అంటున్నారు కాబట్టి ప్రజా బ్యాలెట్‌ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో నిర్వహించి.. అమరావతి అందరిదీ అని నిరూపించాలని పరిశీలకులు సూచిస్తున్నారు.

టీడీపీ కార్యకర్తలతో సంబంధం లేకుండా.. రాష్ట్రంలోని బస్‌ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్‌ కూడళ్లతో ఈ బ్యాలెట్‌ నిర్వహించడం వల్ల ప్రజల అభిప్రాయం స్పష్టం తెలుస్తుంది. అప్పుడు జగన్‌ అరాచకాన్ని బాగా తెలియజేయవచ్చు. అలా కాకుండా తమ కార్యకర్తలకు బాక్సులు ఇచ్చి.. తమ అనుకూలమైన వారి అభిప్రాయాలు సేకరిస్తే.. అది ప్రజా బ్యాలెట్‌ కాదు.. టీడీపీ బ్యాలెట్‌ అవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి టీడీపీ నిర్వహిస్తున్న ప్రజా బ్యాలెట్‌లో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజల అభిప్రాయాలు ఉంటాయా..? లేదా అమరావతి ఉద్యమకారులు, టీడీపీ కార్యకర్తల వరకే పరిమితం అవుతుందా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి