iDreamPost

అబద్ధాలకు హద్దుండాలి బాబూ..!

అబద్ధాలకు హద్దుండాలి బాబూ..!

వయసు పెరిగే కొద్దీ మనిషి ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుందంటారు. వృద్ధాప్యంలో ఉన్న వారు అయితే కుటుంబ సభ్యులతోపాటు చుట్టూ ఉన్నవారు తన నుంచి జీవితపు విలువలు నేర్చుకునేలా జీవిస్తుంటారు. అయితే రాజకీయాల్లో ఉంటే అలా జీవించకూడదని, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనేలా ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తన వ్యవహార శైలి ద్వారా నిరూపిస్తున్నారు. రాజకీయపరమైన విమర్శలు, ఆరోపణలు వరకూ అందరూ చేసేవే. కానీ 70 ఏళ్ల వయస్సులోని చంద్రబాబు ఆడే అబద్ధాలకు హద్దేలేకుండా పోతోంది. రాజకీయ ప్రయోజనం కోసం అసత్యాలైనా మాట్లాడతాననేలా చంద్రబాబు వ్యవహార శైలి ఉండడం అందరినీ ఆలోచింపజేస్తోంది.

దేవాలయాలపై జరుగుతున్న దాడులను అడ్డుపెట్టుకుని రాజకీయంగా వైసీపీకి, సీఎం జగన్‌కు నష్టం చేయాలనే లక్ష్యంతో చంద్రబాబు ఉన్నట్లు ఇటీవల ఆయన రామతీర్థం పర్యటనతోనే స్పష్టమైంది. అయితే ఇప్పుడు ఇంకోక అడుగు ముందుకేసి మత పరమైన అంశాలను తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌.. పాస్టర్లకు ఐదు వేల రూపాయలు ఇవ్వడం ఓటు బ్యాంకు రాజకీయాలకోసమేనని చంద్రబాబు విమర్శించారు. విమర్శించారు అనే కంటే.. అబద్ధం చెప్పారని అనొచ్చు.

ఐదు వేలు ఎవరికి ఇచ్చారు..?

ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్‌ జగన్‌.. పాస్టర్లు, మౌజమ్‌లు, దేవాదాయ శాఖ పరిధిలో లేని అర్చకులకు ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి నెలా ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. గత ఏడాది ప్రారంభంలో అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కూడా ప్రభుత్వం స్వీకరించింది. అయితే కరోనా వెలుగు చూడడం, అనంతం ఏర్పడిన ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఈ పథకం అమలు వాయిదా పడింది. కరోనా కష్టకాలంలో దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు కూడా మూతపడడంతో.. అవే ఆధారంగా జీవించే అర్చకులు, మౌజమ్‌లు, పాస్టర్లకు అండగా ఉండాలని సీఎం జగన్‌ తలపోశారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి ఐదు వేల రూపాయల చొప్పన ఒకే దఫా సాయం చేశారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడాన్ని కూడా ప్రతిపక్ష నేత చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నట్లు ఈ రోజు ఆయన ప్రవర్తించిన తీరుతో స్పష్టంగా తెలుస్తోంది. మతాలకు అతీతంగా అందరికీ సాయం చేయగా.. చంద్రబాబు మాత్రం పాస్టర్లకు ఐదు వేలు ఇస్తున్నారంటూ అసత్యాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. తన ప్రభుత్వ హయాంలో రేషన్‌ సరుకులకు కోత పెట్టి.. ఏడాదికి ఒకసారి క్రిస్మస్‌ పండుగకు.. చంద్రన్న క్రిస్మస్‌ కానుక పేరుతో ముక్కిపోయిన నూనె, శెనగలు, ఉప్పు బెల్లం పంచడం ఏ తరహా రాజకీయం కిందకు వస్తుందనే ప్రశ్న సహజంగానే ఎదురవుతుంది.

ఎవరిది చిన్న చూపు..?

హిందూ దేవాలయాలపై సీఎం జగన్‌కు చిన్న చూపు ఎందుకు..? అంటూ ప్రశ్నించిన చంద్రబాబు.. ఇతరులు తనవైపు వేలెత్తిచూపేలా వ్యవహరించారు. ఏదైనా నిర్మాణానికి, అభివృద్ధి పనులు ప్రారంభించేటప్పుడు పూజ చేయడం ఆనవాయితీ. ఆ సమయంలో సాంప్రదాయ వస్త్రాలు ధరించి, కాళ్లకు చెప్పులు లేకుండా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయితే చంద్రబాబు మాత్రం శంకుస్థాపనలు, ఇతర కార్యక్రమాలను ప్రారంభించే సమయంలో చేసే పూజలో ఏనాడు సాంప్రదాయ వస్త్రాలు ధరించలేదు. పైగా చెప్పులు వేసుకునే పూజలో పాల్గొనేవారు. దేవుని చిత్రపటాలు కూడా కాళ్లకు చేప్పులు వేసుకునే పట్టుకునేవారు. టెంకాయ కొట్టే సమయంలోనూ చంద్రబాబు తన కాళ్లకు ఉన్న చెప్పులను విడవరని అందరికీ తెలిసిన విషయమే. ఆయా చిత్రాలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ తరహా ప్రవర్తనతో ఉన్న చంద్రబాబుకు హిందూ దేవాలయాలపై చిన్నచూపు ఉందా..? లేక అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేటప్పుడు, దేవాలయాలకు వెళ్లినప్పుడు హిందూ సాంప్రదాయం పక్కాగా పాటించే జగన్‌ది చిన్నచూపా..? అనేది జగమెరిగిన సత్యమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి