iDreamPost

ఫోర్డ్ ఇండియా గుజరాత్ యూనిట్ కొనేసిన టాటా మోటార్స్… ధర అక్షరాలా 726 కోట్లు!

ఫోర్డ్ ఇండియా గుజరాత్ యూనిట్ కొనేసిన టాటా మోటార్స్… ధర అక్షరాలా 726 కోట్లు!

టాటా మోటార్స్ కి చెందిన టాటా ప్యాసెంజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (Tata Passenger Electric Mobility Limited, TPEML) గుజరాత్ లోని ఫోర్డ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కొనుగోలు చేసింది. సనంద్ లోని ఈ యూనిట్ కి చెందిన భూమి, బిల్డింగ్స్, వాహన తయారీ యూనిట్, యంత్రాలు, పరికరాలన్నింటినీ 725.7 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. ఈ మేరకు రెండు కంపెనీలు యూనిట్ ట్రాన్స్ ఫర్ ఒప్పందం (UTA)పై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఫోర్డ్ యూనిట్ లో ప్రస్తుతం పని చేస్తున్న అర్హులైన ఉద్యోగులందరూ టాటా మోటార్స్ కి బదిలీ అవుతారు. అయితే ఫోర్డ్ ఇండియా కంపెనీ టాటా నుంచి పవర్ ట్రెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని లీజుపై వెనక్కి తీసుకుని తన కార్యకలాపాలు కొనసాగించనుంది.

టాటా మోటార్స్ ప్యాసెంజర్ వెహికిల్ తయారీ సామర్థ్యం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో ఈ కొనుగోలు చేయడం మంచి నిర్ణయంగా కనిపిస్తోంది. తాజా ఒప్పందం వల్ల ఏటా 3 లక్షలు యూనిట్లు ఉత్పత్తి చేసే అత్యున్నత స్థాయి సామర్థ్యం అదనంగా లభిస్తుందని టాటా కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రానున్న రోజుల్లో ఈ సామర్థ్యం సంవత్సరానికి 4 లక్షల 20 వేల యూనిట్లకు చేరుకోవచ్చని వెల్లడించింది. ఈ ఒప్పందం వాటాదారులకు లాభదాయకమని TPEML ఎండీ శైలేష్ చంద్ర అన్నారు. దీని వల్ల ప్యాసెంజర్ వాహనాల తయారీ, ఎలక్ట్రిక్ వెహికల్ రంగాల్లో తమ కంపెనీకి మరింత పట్టు పెరుగుతుందని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే భారత ఆటోమొబైల్ పరిశ్రమకూ ఇది ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు.

భారతీయుల అవసరాలకు తగ్గట్లు తమ డిజైన్లు మార్చుకోవడంలో విఫలమైన ఫోర్డ్ ఇండియా భారీ నష్టాలు మూటగట్టుకుంది. దీనికి కోవిడ్ కూడా తోడవడంతో ఒక దశాబ్ద కాలంలో ఫోర్డ్ కంపెనీ 2 బిలియన్ డాలర్ల పై చిలుకు నష్టాన్ని నమోదు చేసింది. దీంతో భారత్ లో తమ కార్యకలాపాలు నిలిపేస్తున్నట్లు గత ఏడాది సెప్టెంబర్ లో ప్రకటించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి