iDreamPost

దీక్ష విరమించిన జేసీ.. లక్ష్యం చేరుకున్నారా..?

దీక్ష విరమించిన జేసీ.. లక్ష్యం చేరుకున్నారా..?

తనపై నమోదైన కేసుల నేపథ్యంలో ప్రభుత్వం, పోలీసుల తీరును నిరసిస్తూ ఆమరణనిరాహార దీక్షకు పూనుకున్న టీడీపీ నేత, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి వెనక్కి తగ్గారు. తాడిపత్రి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్షకు చేయాలని జేసీ ప్రభాకర్‌ రెడ్డి నిర్ణయించుకోగా.. ఇటీవల తాడిపత్రిలో జరిగిన ఉద్రిక్త ఘటన నేపథ్యంలో పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పట్టణంలో 144 సెక్షన్‌ అమలు చేసిన పోలీసులు.. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డిని ఇంటి నుంచి బయటకు రానీయలేదు. అయితే ఆయన సతీమణి పోలీసుల కళ్లుకప్పి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. స్థానికంగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి వెళ్లిపోయారు.

తహసీల్దార్‌ కార్యాలయం వద్ద దీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే ఆరు గంటల్లోనే దీక్ష విరమించడం విశేషం. సాయంత్రం నాలుగు గంటలకు జేసీకి మహిళలు నిమ్మరసం ఇవ్వగా.. సేవించిన జేసీ దీక్ష విరమస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి… ఇది ఇంతటితో ఆగదన్నారు. సంక్రాంతి తర్వాత ప్రతి ఊరికి వెళతానని ప్రకటించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి వెళ్లారని వాపోయారు. తనకు పోలీసులపై నమ్మకం లేదన్నారు. తాడిపత్రిలో ఏం జరుగుతుందో అంతా నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యే పెద్దారెడ్డి సతీమణి ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్‌ మీడియాలో పెట్టిన ఫేక్‌ ఆడియోకాల్‌ వల్ల ఇటీవల ఎమ్మెల్యే పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిల మధ్య వివాదం నెలకొంది. ఈ విషయంపై అడిగేందుకు పెద్దారెడ్డి జేసి ఇంటికి వెళ్లగా.. ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో లేరు. అయితే ఇరునేతల అనుచరులు బాహాబాహీగి దిగారు. ఇరు వర్గాలు రాళ్ల వర్షం కురిపించుకున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీటిని నిర సిస్తూ జేసీ తాజాగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయితే పట్టుమని ఆరు గంటలకు కూడా దీక్ష చేయకుండా.. విరమించుకోవడంపై జేసీ లక్ష్యం ఏమిటన్న చర్చ సాగుతోంది.

గడచిన ఎన్నికల్లో ఓటమి, ఆ తర్వాత ఫోర్జరీ పత్రాలతో వాహనాలు విక్రయించిన కేసులో జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన తనయుడులు జైలుకు వెళ్లారు. దాదాపు మూడు నెలల తర్వాత బెయిల్‌పై వచ్చారు. హైకోర్టు కూడా జే సి పనిని తీవ్రంగా తప్పుబట్టి బెయిల్‌ నిరాకరించింది. కింది కోర్టులో బెయిల్‌ పొందారు. ఈ పరిణామాలతో జేసీ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. ఓ వైపు రాజకీయంగా ఓటమి, ఆ తర్వాత చేసిన మోసాలు బయటపడి ప్రతిష్ట తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డిని రెచ్చగొట్టి ఇంటిపైకి వచ్చేలా చేశారనే విమర్శలున్నాయి. ఈ ఘటనను పట్టుకుని రాద్ధాంతం చేయడం ద్వారా… ప్రజల్లో సానుభూతి పొందవచ్చనే ప్లాన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి వేశారని పెద్దారెడ్డి వర్గం విమర్శిస్తోంది. రాజకీయపరమైన వైరంలో.. ఇంట్లోని మహిళలను లక్ష్యంగా చేసుకున్న విషయాన్ని పెద్దారెడ్డి వర్గీయులు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. తన ఇంటికి పెద్దా రెడ్డి వచ్చి దౌర్జన్యం చేశారని, ప్రజలు అంతా గమనిస్తున్నారంటూ.. ప్రభాకర్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పెద్దారెడ్డి వర్గం చేసిన విమర్శలకు బలం చేకూరుతోంది. ఇది ఇంతటితో ఆగదన్న జేసీ.. సంక్రాంతి తర్వాత గ్రామాల పర్యటనకు వెళితే.. తాడిపత్రిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి