iDreamPost

జేసీ రాజకీయ సన్యాసం శపథం ఉద్దేశం ఏమిటి..?

జేసీ రాజకీయ సన్యాసం శపథం ఉద్దేశం ఏమిటి..?

చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ జేసీ ప్రభాకర్‌ రెడ్డి శపథం చేశారు. ఇలాంటి శపథమే మాజీ మంత్రి, వైసీపీ రీజనల్‌ కో ఆర్డినేటర్‌ కొడాలి నాని కూడా చేశారు. చంద్రబాబు జన్మలో ముఖ్యమంత్రి కాలేరని, ఒక వేళ మళ్లీ ముఖ్యమంత్రి అయితే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, రాజకీయ సన్యాసం తీసుకుంటానని నాని శపథం చేశారు. నాని చేసిన వ్యాఖ్యలే జేసీ ప్రభాకర్‌ రెడ్డి కూడా చేశారు. అయితే చంద్రబాబు సీఎం కాలేడని నాని ఉద్దేశం కాగా.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి వ్యాఖ్యల ఉద్దేశం.. చంద్రబాబును సీఎం చేసిన తర్వాత తాను రాజకీయ సన్యాసం తీసుకుంటాని కాబోలు.

ఈ తరహా వ్యాఖ్యలు చేయడం జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కొత్తేమి కాదు. ఇటీవల జరిగిన పరిణామాల తర్వాత జేసీ బ్రదర్స్‌కు చంద్రబాబుతో దూరం పెరిగిందనే టాక్‌ నడుస్తోంది. పొరుగు నియోజకవర్గాల్లో స్థానిక నేతలతో సంబంధం లేకుండా కార్యక్రమాలు నిర్వహించడం వల్ల జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారనే చర్చ నడుస్తోంది. పుట్టపర్తి టిక్కెట్‌ మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌ రెడ్డికి ఇస్తే ఓడిపోతామని, కొత్త వారికి ఇవ్వాలంటూ.. శ్రీనివాస్‌ రెడ్డి అనే వ్యక్తిని పుట్టపర్తి టీడీపీ కార్యకర్తలకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇటీవల పరిచయం చేశారు. పుట్టపర్తితోపాటు అనంతపురం, కళ్యాణదుర్గం వంటి నియోజకవర్గాలపైనా పెత్తనం చేసేందుకు జేసీ బ్రదర్స్‌ యత్నిస్తున్నారు. ఈ పరిణామాలు స్థానిక టీడీపీ నేతలకు రుచించడంలేదు. ఈ పంచాయతీ చంద్రబాబు వద్దకు చేరిందని, ఆయన జేసీకి అక్షింతలు వేశారని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు.

ఈ క్రమంలోనే పరిస్థితిని మళ్లీ పూర్వ స్థితికి తీసుకువచ్చేందుకు, చంద్రబాబు మెప్పు పొందేందుకు జేసీ ప్రభాకర్‌ రెడ్డి రాజకీయ సన్యాసం వ్యాఖ్యలు చేశారని తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. పల్లె రఘునాథ్‌ రెడ్డి గెలవకపోతే 2014లోనే తనకు మంత్రి పదవి వచ్చేదనే భావనలో ఉన్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చి, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే.. మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేస్తారు గానీ.. రాజకీయ సన్యాసం ఎందుకు తీసుకుంటారనే సాధారణమైన ప్రశ్న అనంతపురం తమ్ముళ్లు సంధిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి టిక్కెట్‌ పల్లె రఘునాథ్‌ రెడ్డికి రాకుండా చేస్తే.. మంత్రి పదవి రేసులో తనకు అడ్డు ఉండదని ఇప్పటి నుంచే ఆ ప్రయత్నాలు చేస్తున్న జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పడం విడ్డూరంగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి