iDreamPost

ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటు తిరస్కరణ.. తాడిపత్రిలో ఏం జరగబోతోంది..?

ఎమ్మెల్సీలకు ఎక్స్‌అఫిషియో ఓటు తిరస్కరణ.. తాడిపత్రిలో ఏం జరగబోతోంది..?

ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. 36 వార్డులకు గాను టీడీపీ ఇక్కడ 18 వార్డులను గెలుచుకోవడంతో మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎక్స్‌ అఫిషియో ఓట్లతో అధికార వైసీపీ చైర్మన్‌ పీఠాన్ని గెలుచుకుంటుందని భావించగా.. అందుకు తాజాగా మున్సిపల్‌ కమిషనర్‌ జారీ చేసిన ఆదేశాలతో దారులుమూసుకుపోయాయి.

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక కోసం వైసీపీ ఎమ్మెల్సీలు మహ్మద్‌ ఇక్బాల్, శమంతకమణి, గోపాల్‌ రెడ్డిలు, టీడీపీ ఎమ్మెల్యే దీపక్‌ రెడ్డి చేసుకున్న దరఖాస్తులను మున్సిపల్‌ కమిషనర్‌ తిరస్కరించారు. ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉన్న చోటనే ఎక్స్‌ అఫిషియో ఓటు ఉంటుందని కమిషనర్‌ స్పష్టం చేశారు. దీంతో తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

Also Read : మరోసారి సత్తా చాటిని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి

ఎమ్మెల్సీలకు ఎక్స్‌ అఫిషియో ఓట్లు లేకపోతే.. చైర్మన్‌ పీఠం టీడీపీ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. 36 వార్డులున్న తాడిపత్రిలో రెండు వార్డులను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. 34 వార్డులకు పోలింగ్‌ జరగ్గా.. టీడీపీ 18 వార్డులు, వైసీపీ 14 వార్డులు, ఒక వార్డులో సీపీఐ, మరో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ అనంతపురం ఎంపీ తలారి రంగయ్యలకు ఎక్స్‌ అఫిషియో ఓట్లు జారీ అయ్యాయి. టీడీపీకి సీపీఐ, స్వతంత్ర అభ్యర్థి మద్ధతు ఇస్తుండడంతో టీడీపీ బలం 20కి చేరుకుంది. వైసీపీ 16 వార్డులు, ఎమ్మెల్యే, ఎంపీ ఎక్స్‌ అఫిషియో ఓట్లతో అధికార పార్టీ బలం 18కి చేరుకుంటుంది.

మున్సిపల్‌ చైర్మన్‌ పీఠం గెలుచుకునేందుకు 19 ఓట్లు అవసరం. టీడీపీకి 20 ఓట్లు ఉన్నాయి. వైసీపీ బలం 18 వద్దే ఆగిపోయింది. అదే ఎమ్మెల్సీలకు ఎక్స్‌ అఫిషియో ఓట్లు ఉంటే.. టీడీపీ, వైసీపీ బలాబలాలు 21 ఓట్లతో సమానమవుతాయి. టాస్‌ వేసి ఫలితాన్ని నిర్ణయిస్తారు.

ఈ నెల 18వ తేదీన చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు కమిషనర్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. అయితే ఎన్నిక జరుగుతుందా..? లేదా..? అనేదే ఇప్పుడు ఆసక్తికర అంశం. ఎక్స్‌ అఫిషియో ఓట్ల కోసం తాము చేసుకున్న దరఖాస్తులను కమిషనర్‌ తిరస్కరించడంపై వైసీపీ ఎమ్మెల్సీలు కోర్టుకు వెళ్లే ఛాన్స్‌ ఉంది. అదే జరిగితే కోర్టు తీర్పు వచ్చే వరకూ చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా పడడం ఖాయం.

Also Read : ఆశ్చర్యకరంగా మైదుకూరు ఫలితం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి