iDreamPost

ఏడాదికొకరికి చైర్మన్‌ పదవి.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాటపై నిలబడతారా..?

ఏడాదికొకరికి చైర్మన్‌ పదవి.. జేసీ ప్రభాకర్‌ రెడ్డి మాటపై నిలబడతారా..?

తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన్‌గా ఎన్నికైన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి.. వైఎస్‌ జగన్‌ నైతిక విలువలున్న నేతని ప్రశంసించారు. అందుకే తాను చైర్మన్‌ అయ్యానని చెప్పారు. ప్రత్యర్థి పార్టీ నేతలను ప్రశంసలతో ముంచెత్తిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మాత్రమే కాదు.. జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కూడా నైతిక విలువలున్న నేతని చెప్పుకునేందుకు అవకాశం ఉంది. చెప్పిన మాటను నిలబెట్టుకోవడం ద్వారా జేసీపై తాడిపత్రి ప్రజలు, ముఖ్యమంగా టీడీపీ కౌన్సిలర్లు ప్రశంసల జల్లు కురిపిస్తారు.

తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా జేసీ ప్రభాకర్‌ రెడ్డి భావించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అనేక రకాల ప్రచారాలు చేశారు. ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పరమైన హామీలు కూడా ఇచ్చారు. తనకు చైర్మన్‌ అవ్వాలని లేదన్నారు. ఏడాదికి ఒకరు చొప్పన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను చైర్మన్‌ చేద్దామని హామీ ఇచ్చారు. పార్టీ అభ్యర్థులతోనూ ప్రచారం చేయించారు. తద్వారా అన్ని కులాల ప్రజల ఓట్లు పాందేందుకు యత్నించారు.

మొత్తం మీద జేసీ ప్రభాకర్‌ రెడ్డి అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ హవా సాగితే.. ఒక్క తాడిపత్రిలో మాత్రం టీడీపీ గెలిచింది. 36 స్థానాలకు గాను టీడీపీ 18, దాని మిత్రపక్షం సీపీఐ 1, స్వతంత్ర అభ్యర్థి ఒక స్థానంలో గెలిచారు. వైసీపీ 16 వార్డులు గెలుచుకుని ప్రతిపక్షంలో కూర్చుంది.

ఎన్నికలకు ముందు రాజకీయ నేతలు ఎన్నో చెబుతారు. గెలిచిన తర్వాత వాటిని అమలు చేయడం, పాటించడం చేస్తే వారి గౌరవం పెరుగుతుంది. పదవి అంటే ఎవరికి చేదు.. అలానే ఉంది జేసీ ప్రభాకర్‌ రెడ్డి తీరు కూడా. ఎన్నికలకు ముందు తనకు చైర్మన్‌ అవ్వాలని లేదని, కులాల వారీగా ఏడాదికి ఒకరి చొప్పన చైర్మన్‌ పదవి ఇద్దామని చెప్పిన ఆయన.. చైర్మన్‌ సీటులో కూర్చుకున్నారు. అన్ని కులాల వారీకి ఏడాది చొప్పన అన్నారు కాబట్టి.. మొదటి ఏడాది ఓసీ అయిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఆ పీఠంపై కూర్చున్నారని అనుకోవచ్చు. టీడీపీ కౌన్సిలర్లు కూడా ఇదే భావనలో ఉండొచ్చు.

మరి రెండో ఏడాదిలో తాను చెప్పిన మాట ప్రకారం చైర్మన్‌ పీఠంపై మరొకరిని ప్రభాకర్‌ రెడ్డి కూర్చుపెట్టాలి. ఇది జరగాలంటే జేసీ పీఠం దిగాలి. ఇందుకు అయన సుముఖంగానే ఉంటారా..? రెండో ఏడాది నుంచి ఏడాదికి ఒకరు చొప్పన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చైర్మన్‌ పీఠం దక్కాలి. మరి జేసీ ప్రభాకర్‌ రెడ్డి తాను చెప్పిన మాటను నిలబెట్టుకుని.. తాను కూడా వైఎస్‌ జగన్‌ మాదిరిగా నైతిక విలువలు ఉన్న నేతనని నిరూపించుకుంటారా..? మరో ఏడాది తర్వాత ఈ విషయం తేలిపోతుంది.

Also Read : టీడీపీదే తాడిపత్రి.. మరోసారి చైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి