iDreamPost
android-app
ios-app

టీమిండియాకు మరో ‘ఛేజ్ మాస్టర్’ దొరికాడా! అదరగొడుతున్న యంగ్ స్టర్..

  • Author Soma Sekhar Updated - 04:57 PM, Tue - 17 October 23
  • Author Soma Sekhar Updated - 04:57 PM, Tue - 17 October 23
టీమిండియాకు మరో ‘ఛేజ్ మాస్టర్’ దొరికాడా! అదరగొడుతున్న యంగ్ స్టర్..

‘ఛేజ్ మాస్టర్’.. క్రికెట్ లో ఈ పదం వినగానే మనకు ఠక్కున గుర్తుకు వచ్చే ఏకైక పేరు విరాట్ కోహ్లీ. అంతలా అతడు వరల్డ్ క్రికెట్ పై తన ముద్రను వేశాడు. ఇక ఛేజింగ్ అంటే విరాట్ కోహ్లీకి పూనకాలే అని చెప్పాలి. అయితే విరాట్ కోహ్లీ తరహాలోనే టీమిండియాలోకి మరో ఛేజ్ మాస్టర్ దూసుకొస్తున్నాడు. ఇప్పటికే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ యువ కెరటం.. తాజాగా జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2023లో దుమ్మురేపుతున్నాడు. తొలి రెండు మ్యాచ్ ల్లో చివరిదాక క్రీజ్ లో ఉండి జట్టును విజయపథంలో నడిపించాడు. మరి టీమిండియాలో మరో ఛేజ్ మాస్టర్ గా మారతున్న ఆ యంగ్ స్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

దేశవాళీ టీ20 టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోఫ్రీ 2023 తాజాగా ప్రారంభం అయ్యింది. ఈ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు దుమ్మురేపుతోంది. వరుసగా రెండు మ్యాచ్ లు నెగ్గి టోర్నీలోని ప్రత్యర్థులకు సవాల్ విసిరింది. ఇక ఈ రెండు మ్యాచ్ ల్లో ఛేజ్ చేసి గెలిచింది హైదరాబాద్ టీమ్. ఈ రెండు గేముల్లో హైదరాబాద్ టీమ్ కెప్టెన్ తిలక్ వర్మ ఛేజ్ మాస్టర్ గా నిలిచాడు. తొలి మ్యాచ్ లో మేఘాలయ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.2 ఓవర్లలోనే దంచికొట్టారు హైదరాబాద్ ఆటగాళ్లు. ఇందులో కెప్టెన్ తిలక్ వర్మ 31 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడికి తోడు తన్మయ్ అగర్వాల్(46*) రాణించాడు. ఇక మంగళవారం జమ్ముకశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో కూడా చెలరేగాడు ఈ తెలుగు తేజం. తొలుత బ్యాటింగ్ చేసిన జమ్ముకశ్మీర్ నిర్ణీత 20 ఓవర్లలో 159 పరుగులు చేసింది.

అనంతరం 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్ టీమ్.. కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇక ఈ మ్యాచ్ లో కూడా ఛేజ్ మాస్టర్ పాత్రను కెప్టెన్ తిలక్ వర్మే పోషించాడు. అతడు 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి.. జట్టుకు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. ప్రస్తుతం అతడి ఫామ్ చూస్తుంటే టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ దొరికాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు క్రీడా నిపుణులు. తొలిసారి హైదరాబాద్ టీమ్ కు సారథ్యం వహిస్తున్న తిలక్ వర్మ తనదైన బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు. కాగా.. భవిష్యత్ లో అతడు ఇదే ఫామ్ ను కొనసాగిస్తే.. జట్టులో సుస్థిర స్థానంతో పాటుగా మరో ఛేజ్ మాస్టర్ టీమిండియాకు దొరికినట్లే. మరి తిలక్ వర్మ విరాట్ కోహ్లీలా మరో ఛేజ్ మాస్టర్ గా మారుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.