iDreamPost

మళ్ళీ స్వదేశీ నినాదం

మళ్ళీ స్వదేశీ నినాదం

ప్రపంచదేశాల్లో కరోనా వైరస్ చేస్తున్న విధ్వంసం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవైపు దాదాపు 2.5 లక్షలు దాటిని మరణాలు, మరోవైపు 43 లక్షలు దాటిని బాధితులు. ఇదే సమయంలో ప్రపంచ ఆర్ధిక రంగంతో పాటు ఉత్పత్తి, సేవలు, టూరిజం, ఆటోమొబైల్… ఇలా ఎన్నో రంగాలను కుదేలు చేసేసింది ఈ వైరస్. హోలు మొత్తం మీద ప్రపంచ దేశాలకు లక్షల లక్షల కోట్ల రూపాయల భారీ నష్టాలకు గురిచేసింది కరోనా వైరస్.

సీన్ కట్ చేస్తే పైన చెప్పుకున్నదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరి మరో వైపేమిటి ? ఏమిటంటే ప్రతి చిన్న విషయానికి చైనా మీద ఆధారపడటం మానుకోవాలనే జ్ఞానం వచ్చినట్లే ఉంది కొన్ని దేశాలకు. జ్ఞానం వచ్చిన దేశాల్లో భారత్, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రెజిల్ లాంటి దేశాలున్నాయి. మంగళవారం ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోడి చేసిన ప్రసంగంలో స్వదేశీ మంత్రాన్ని పఠించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక నుండి మనదేశంలో వాడే వస్తువులన్నీ స్వదేశీ తయారీవే అయ్యుండాలని మోడి చాలా గట్టిగా చెప్పారు.

మనదేశం అనే కాదు యావత్ ప్రపంచదేశాలు ఏమి చేస్తున్నాయంటే చైనా ఉత్పత్తులకు బాగా అలవాటు పడిపోయాయి. చివరకు మూతికి చుట్టుకునే మాస్కులు, శానిటైజర్లు కూడా చైనా ఉత్పత్తులే. మెడికల్ రంగం, ఆటోమొబైల్, సాంకేతిక, సమాచారంతో పాటు చాలా రంగాల్లో ఏ దేశంలో చూసినా చైనా ఉత్పత్తులు మాత్రమే కనబడతాయి. నిజంగా ప్రపంచదేశాలు సిగ్గు పడాల్సిన అంశం. మనం వాడుతున్న మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, టివీలు, రిమోట్లు ఇలా.. ఏది తీసుకున్నా చైనా ఉత్పత్తులే.

యావత్ ప్రపంచం చైనా మీద అంతగా ఆధారపడింది కాబట్టే కరోనా వైరస్ దెబ్బకు చైనాలో ఉత్పత్తి, మెడికల్ తదితర రంగాలు మూతపడిపోయినపుడు ప్రపంచం పడిన ఇబ్బందులు అంతా ఇంతా కాదు. దాంతో ముందుగా అమెరికా తరువాత చాలా చాలా దేశాలు మేల్కొన్నాయి. ప్రతి విషయానికి చైనా మీద ఆధారపడకుండా ఏ దేశానికి ఆ దేశం స్వయం సిద్ధం కావాలని డిసైడ్ అయ్యాయి. తాజాగా భారత్ కూడా ఆ దేశాల సరసన చేరింది.

నిర్ణయం అయితే తీసుకున్నాయి కానీ ఎంత వరకు ఆచరనలో పెడతాయో తెలీదు. నిజంగానే మోడి ప్రకటన ఆచరణలోకి వస్తే దేశంలోని లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి దొరుకుతుంది. ఇపుడు మనం వాడుతున్న మొబైళ్ళు, ఛార్జర్లే కాదు కంప్యూటర్లు, టీవీల్లాంటి అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను మనదేశంలోనే తయారు చేసుకోవచ్చు. ఇపుడు ఎలాగూ మైక్రోమ్యాక్స్, సెల్ కాన్ లాంటి మొబైల్ ఫోన్లు, మైక్రోమ్యాక్స్ టీవీలు తయారువుతున్నాయి. అయితే వాటి మదర్ బోర్డులు, హార్డ్ డిస్కుల్లో కొన్ని చైనా నుండి వస్తున్నాయి. నిపుణులు గనుక వాటిపైన దృష్టి పెడితే ఇకనుండి అవి కూడా స్ధానికంగానే తయారవుతాయి.

ఏదేమైనా స్వదేశీ ఉత్పత్తులనే వాడాలంటూ మోడి ఇచ్చిన పిలుపు గనుక ఆచరణలోకి వస్తే దేశానికి మంచి జరిగినట్లే. కుటీర పరిశ్రమలే దేశానికి పట్టుగొమ్మలంటూ మహాత్మాగాంధి చెప్పిన మాట ఇప్పటికైనా ఆచరణలోకి వస్తే సంతోషమే కదా.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి