iDreamPost

ప్రభుత్వంపై కేసులు ఎవరి ప్రయోజనాల కోసం.. ?

ప్రభుత్వంపై కేసులు ఎవరి ప్రయోజనాల కోసం.. ?

ప్రజాస్వామ్యానికి మూల స్థంభాలుగా పేర్కొనే వాటిలో న్యాయవ్యవస్థ కీలకమైంది. అన్యాయాన్ని సరిచేయడానికి న్యాయ వ్యవస్థ దోహదపడాలి. కానీ దేశంలో పరిస్థితి అందుకు పూర్తిగా కొనసాగుతోంది. న్యాయ స్థానాల ముందు లక్షల్లో కేసులు మూలుగుతున్నాయి. అన్యాయానికి గురైన వాళ్లకంటే ప్రత్యర్థులపై కక్ష సాధింపు కోసం న్యాయస్థానాలను ఆశ్రయించేవాళ్లు రోజు రోజుకూ పెరుగుతున్నారు. ఫలితంగా న్యాయం దక్కాల్సిన వాళ్లకు దక్కాల్సిన సమయంలో దక్కడం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఇదే విషయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ‘‘పత్రికల్లో వచ్చిన కథనాలు తీసుకొని మీకేం కావాలో అది కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారా? దీన్ని ఎలా పరిగణించాలి?’’ అంటూ ప్రశ్నించింది. ‘‘వంద మంది పిటిషన్లో ఇంప్లీడ్‌ అవుతామంటే వంద మందినీ అనుమతించాలా?’’ ఇని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానిచింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ సుప్రీం కోర్టు సీజేకి లేఖ రాశాడని, దానిని బహిర్గతం చేసిన సీఎం జగన్‌పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీం కోర్టులో 2 పిటీషన్లు ధాఖలయ్యాయి. న్యాయవాదులు జీఎస్‌ మణి, ప్రదీప్‌ కుమార్‌ సింగ్‌, యాంటీ కరప్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్టుతోపాటు మరో న్యాయవాది సునీల్‌ కుమార్‌ సింగ్‌ దాఖలు చేసిన పిటీషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ దినేశ్‌ మహేశ్వరి, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం సీఎం వైఎస్‌ జగన్‌ను పదవి నుంచి తొలగించాలంటూ కోరడానికి చట్టరీత్యా వీల్లేదని స్పష్టం చేసింది. అసలు ఏ ప్రయోజనం కోసం యాంటీ కరప్షన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ట్రస్టుతో ఏర్పాటు చేశారు? అని ప్రశ్నించింది. వందల మంది పిటీషన్ లో ఇంప్లీడ్ అయితే అనుమతించాలా? అని ప్రశ్నించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే పలు కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీతో సహా వేరు వేరు సంస్థల పేరుతో ప్రభుత్వంపై కేసులు వేస్తున్నారు. ఈ వ్యవహారం రాష్ట్రంలో రాజకీయ దుమారానికి కారణమవుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్యుద్ధానికీ కారణమవుతోంది. న్యాయస్థానాల్లో కేసులు ఉండడం వల్ల పలు అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని అధికార పార్టీ ఆరోపిస్తోంది. ప్రతిపక్షాలు ఉద్దేశ్యపూర్వకంగా కేసులు వేస్తున్నాయని, సంక్షేమ పథకాలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. ఈ వాదనకు బలం చేకూర్చే విధంగానే ప్రతిపక్షాల తీరు కనిపిస్తోంది.

న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న లక్షలాది కేసులను క్లియర్ చేయడంపై న్యాయవ్యవస్థ దృష్టిసారిస్తుంటే… రాజకీయ ఉద్దేశాలతో కేసులు వేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇలాంటి కేసుల వెనక ప్రజల ప్రయోజనాల కంటే, రాజకీయ ప్రయోజనాలే ఎక్కువగా ఉంటుండడం గమనార్హం. ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లలోనూ ప్రధానంగా ఇదే కనిపిస్తోంది. సుప్రీం కోర్టు అసహనానికి కూడా ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అందుకే… ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీజేఐకి రాసిన లేఖను బహిర్గతం చేయడంపై విచారణ చేయాలంటూ దాఖలైన పిటిషన్లను కొట్టివేస్తున్నట్టు పేర్కొంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి