iDreamPost

రాజ్యాంగ విచ్ఛిన్న అంశం : ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రిం స్టే

రాజ్యాంగ విచ్ఛిన్న అంశం : ఏపీ హైకోర్టు ఆదేశాలపై సుప్రిం స్టే

ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందా..? లేదా..? అనే అంశంపై విచారణ జరిపి తేలుస్తామన్న ఏపీ హైకోర్టు నిర్ణయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. పోలీసులు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఏపీ హైకోర్టులో దాఖలైన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్లను విచారించిన ధర్మాసనం.. రాష్ట్రంలో రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతోందంటూ వ్యాఖ్యానించింది. ఈ విషయంపై విచారణ జరిపి తేలుస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగా వ్యక్తులను అరెస్ట్‌ చేస్తున్నారంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ అంశంపై ఇటీవల వరకు ఏపీ హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి.

అయితే ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రిం కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రిం ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సుప్రిం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగ వైఫల్యం అంటూ హైకోర్టు ఎలా అంటుందని ప్రశ్నించింది. శీతాకాల శెలవుల తర్వాత ఈ అంశంపై తదుపరి విచారణ చేపడతామని పేర్కొంటూ  విచారణను వాయిదా వేసింది.

రాజ్యాంగ విచ్ఛినం అంశంపై.. ఏపీ హైకోర్టులో ఈ నెల 14వ తేదీన కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంపై విచారణ ఆపాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో.. అనే అంశంపై విచారణ ఆపబోమని తేల్చిచెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు నిర్ణయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడం గమనార్హం.

Read Also ; న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోమనడం రాజ్యాంగం కల్పించిన హక్కే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి