iDreamPost

భారత్ బంద్ కి పెరుగుతున్న మద్ధతు

భారత్ బంద్ కి పెరుగుతున్న మద్ధతు

రైతు ఉద్యమానికి మద్ధతుగా డిసెంబర్ 8 జరగబోతున్న భారత్ బంద్ కార్యక్రమానికి మద్ధతు పెరుగుతోంది. వివిధ రాష్ట్రాల్లో రైతు సంఘాలు, ఇతర సంఘాలతో పాటుగా పలు పార్టీలు మద్ధతు ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో పాటుగా తెలంగాణా సీఎం కేసీఆర్ కూడా బంద్ కి మద్ధతు ప్రకటించారు. ఇక బెంగాల్ సీఎం, తమిళనాడులో ప్రతిపక్షం కూడా భారత్ బంద్ కి అండగా నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, లెఫ్ట్ అధికారంలో ఉన్న కేరళలో కూడా బంద్ విజయవంతానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏపీలో కూడా లెఫ్ట్, కాంగ్రెస్ సంఘాలు సిద్దమవుతున్నాయి. వివిధ ప్రజా సంఘాలు తోడవుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమ బాట పట్టారు. ఏకంగా వేల మంది హస్తినలో ఆందోళనకు ప్రయత్నించిన పంజాబ్, హర్యానా రైతులను సరిహద్దుల్లో అడ్డుకున్నారు. ఇప్పటికే 11 రోజులుగా వారి నిరసనలు సాగుతున్నాయి. అదే సమయంలో వారికి అండగా రాజస్తాన్, యూపీ, ఉత్తరాఖండ్ రైతులు కూడా బయలుదేరడంతో ఢిల్లీకి నలుమూలలా సరిహద్దుల్లో పహారా పెట్టాల్సి వచ్చింది. ఫలితంగా ప్రస్తుతం ఢిల్లీ వాసులు తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు.

రైతులతో ఇప్పటికే ప్రభుత్వం ఐదు విడతల చర్చలు జరిపింది. కానీ ఫలితం కనిపించడం లేదు. సవరణలకు సిద్ధమేనని ప్రభుత్వం చెబుతుంటే, చట్టాలు ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ చర్చల సందర్భంగా రైతు సంఘాల ప్రతినిధుల తీరు చర్చనీయాంశం అవుతోంది. ప్రభుత్వం తరుపున అందించే టీ, ఆహారం కూడా తీసుకోవడానికి నిరాకరిస్తూ తమ వెంట తీసుకెళ్లిన ఆహారం తింటున్న రైతు సంఘాల ప్రతినిధుల చిత్తశుద్ధి సోసల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రచారం సాగుతోంది.

తాజాగా రైతులు వ్యవసాయ చట్టాలతో పాటు కేంద్ర ప్రతిపాదించిన నూతన విద్యుత్ బిల్లు కూడా రద్దు చేయాల్సిందేనని నినదిస్తున్నారు. ప్రభుత్వం వెనక్కి తగ్గేవరకూ తాము ఆందోళన ఉపసంహరించేది లేదని చెబుతున్నారు. పైగా తాము ఏడాది పాటు ఆందోళన సాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో హస్తినకు వచ్చామని, ప్రభుత్వం అడ్డుకోవడంతోనే తాము రోడ్డు మీద ఉన్నామని చెబుతున్నారు. అదే సమయంలో ఢిల్లీ రైతు ఉద్యమం కోసం పంజాబ్ లోని అనేక గ్రామాల నుంచి ఇంటికో మనిషి అనే చందంగా బయలుదేరడం ఆసక్తిగా మారుతోంది. ఉద్యమానికి వెళ్లిన రైతుల పొలాలను ఊరిలో మిగిలిన వారంతా కలిసి సాగు చేసి ఆ రైతు కుటంబానికి అందించేలా ముందుగానే వారి సన్నాహాలు చేసుకున్న తీరు విశేషంగా మారుతోంది.

మరోవైపు ఇప్పటికే ఈ రైతు ఉద్యమం అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యింది. ఐక్యరాజ్యసమతి స్పందించింది. కెనడా ప్రధాని ప్రకటనలు కలకలం రేపాయి. తాజాగా లండన్ దిగువ సభలో కూడా చర్చకు రావడం విశేషం. దేశంలో రైతులకు మద్ధతుగా పంజాబ్ కి చెందిన పలువురు కళాకారులు, క్రీడాకారులు అవార్డ్ వాపసీ కి శ్రీకారం చుట్టారు. ఉద్యమం మరింత రాజుకోవడంతో ప్రముఖులు కూడా అందులో భాగస్వామి అవుతున్నట్టుగా కనిపిస్తోంది. తమిళనాడుకి చెందిన సినీ హీరో కార్తి కూడా రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో జరగబోతున్న భారత్ బంద్ కి విశేష మద్ధతు ఖాయమని భావిస్తున్నారు. 8వ తేదీన బంద్ తర్వాత 9న మళ్లీ రైతు సంఘాలతో చర్చలకు కేంద్రం సిద్ధమవుతోంది. దాంతో బంద్ ప్రభావం ఆ చర్చలపై ఉంటుందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం భారత్ బంద్ అంశం సోషల్ మీడియాలో కూడా ట్రెండ్ అవుతుండడం విశేషం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి