iDreamPost

క్లాస్ రూమ్‌లోనే 9వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి!

క్లాస్ రూమ్‌లోనే  9వ తరగతి విద్యార్థి గుండెపోటుతో మృతి!

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల వరుస గుండెపోటు మరణాలు తీవ్ర కలవరాన్ని సృష్టిస్తున్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్దుల వరకు వయసుతో సంబంధం లేకుండా ఎక్కడి వాళ్లు అక్కడే కుప్పకూలిపోతున్నారు. ఆస్పత్రికి తరలించేలోపు కన్నుమూస్తున్నారు. ఈ మద్య వ్యాయామం, డ్యాన్సులు చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసిన ఘటనలు ఎన్నో వెలుగు చూశాయి. తాజాగా క్లాస్ రూమ్ లోనే 9వ తరగతి చదువుతున్న విద్యార్థి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన లక్నోలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.

లక్నోలో విషాద ఘటన చోటు చేసుకుంది. నగరానికి చెందిన సిటీ మాంటిస్సోరీ స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న అతీఫ్ సిద్దిఖీ అనే విద్యార్థికి గుండెపోటు రావడంతో క్లాస్ రూమ్ లోనే కుప్పకూలిపోయాడు. వెంటనే హాస్పిటల్ కి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు స్కూల్ యాజమాన్యం ప్రకటించింది. ఈ మద్యనే అతీఫ్ సిద్దిఖీ తన 14వ పుట్టిన రోజు తోటి విద్యార్థులతో ఎంతో ఆనందంగా జరుపుకున్నారని.. ఇంతలోనే ఇలాంటి విషాదం జరుగుతుందని ఊహంచలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు స్కూల్ యాజమాన్యం.

అతీఫ్ సిద్దిఖీ చదువుతో పాటు అన్ని విషయాల్లో చురుకుగా ఉంటారని టీచర్లు అన్నారు. కెమిస్ట్రీ క్లాస్ జరుగుతున్న సమయంలో అతీఫ్ ఉన్నట్టుండి స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే క్లాస్ టీచర్ అతీఫ్ కి సీపీఆర్ చేసినప్పటికీ అతీఫ్ స్పృహలోకి రాలేదు. స్కూల్ యాజమాన్యం అతీఫ్ తండ్రికి సమాచారం అందించి దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే అతీఫ్ తండ్రి ఆసుపత్రికి చేరుకున్నాడు. అతీఫ్ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు వెల్లడించారు. అప్పటి వరకు తమతో ఎంతో హ్యాపీగా గడిపిన అతీఫ్ గుండెపోటుతో మరణించడంతో పాఠశాల, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి