iDreamPost

SS Rajamouli : జక్కన్న చూపిస్తున్న కొత్త ట్రెండ్

SS Rajamouli : జక్కన్న  చూపిస్తున్న కొత్త ట్రెండ్

మాములుగా సినిమా రిలీజ్ డేట్లు ప్రకటించేటప్పుడు ఒకటే తేదీని ఎంచుకుంటారు. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే. కానీ రెండు లాక్ చేసుకుని ఏదో ఒక రోజు వస్తామని చెప్పడం మాత్రం ఇప్పుడో ట్రెండ్ గా మారిపోయింది. రాజమౌళి దీనికి శ్రీకారం చుట్టి ఆయన ఫాలో కావడం లేదు కానీ మిగిలినవాళ్లు మాత్రం ఎంచక్కా అనుసరిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆర్ఆర్ఆర్ ని అయితే మార్చి 18 లేదా ఏప్రిల్ 28 విడుదల చేస్తామని ప్రకటించిన జక్కన్న నిన్న ఉన్నట్టుండి ఆ రెండూ తూచ్ ఖచ్చితంగా మార్చి 25నే వస్తామని నొక్కి చెప్పారు. దీని ప్రభావం నేరుగా మిగిలిన సినిమాల మీద పడి నేనంటే నేనంటూ పోటీ పడి మరీ అనౌన్స్ మెంట్లు ఇచ్చేశారు.

ఇప్పుడీ రెండు డేట్ల పద్ధతిని ఒక్కొక్కరుగా అందిపుచ్చుకుంటున్నారు. భీమ్లా నాయక్ నిన్నే ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 అని అఫీషియల్ గా చెప్పింది. పరిస్థితులను బట్టి నిర్ణయం ఉంటుందని, ఈ రెండులో ఒకటి ఫిక్స్ అని చెప్పకనే చెప్పింది. ఇప్పుడిదే దారిలో వరుణ్ తేజ్ గని కూడా వెళ్ళింది. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4 అని ఇందాకా అప్ డేట్ చేసిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో క్లారిటీ ఇచ్చింది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ కనక తప్పుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుందామని గని టీమ్ ఆలోచన. శర్వానంద్ ఆడవాళ్ళూ మీకు జోహార్లుతో కాంపిటీషన్ అన్న మాట. మీడియం బడ్జెట్ తో రూపొందుతున్న గని కూడా ఇలా చేయడం ఆశ్చర్యమే.

ఇప్పుడేదో బాగానే అనిపిస్తుంది కానీ భవిష్యత్తులో ఈ రెండు డేట్ల వ్యవహారం తలనెప్పి తెప్పిస్తుంది. వేరే సినిమాలకు దారి లేకుండా స్పష్టత ఇవ్వకుండా ఇలా చేయడం ఇతర నిర్మాతలకు ఇబ్బంది పెట్టడమే. అసలే లాక్ డౌన్ల వల్ల ల్యాబులో వెయిట్ చేస్తున్న చిత్రాలు చాలా ఉన్నాయి. ఒక పద్ధతి ప్రకారం మాట్లాడుకుని షెడ్యూల్స్ వేసుకుంటే ఎలాంటి ఇబ్బంది రాదు. లేదూ పరిస్థితుల మీద అసలు నమ్మకమే లేదనుకుంటే రెండు మూడు నెలలు ఆలస్యంగా రావాలి. అంతే తప్ప ఈ రెండు డేట్లు నేను తీసుకుంటున్నాను ఆపై మీ ఇష్టం అని చెప్పడం చిక్కులను కొనితెచ్చేదే. జక్కన్న డ్రాప్ అయినా మిగిలినవాళ్లు ఈ పద్ధతిని కొనసాగించేలా ఉన్నారు

Also Read : Saamanyudu : కొత్త నెల మొదటి బోణీ డబ్బింగ్ సినిమానే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి