iDreamPost

చిన్న సినిమా పెద్ద ధైర్యం

చిన్న సినిమా పెద్ద ధైర్యం

రాజావారు రాణిగారుతో తెరకు పరిచయమైన హీరో కిరణ్ అబ్బవరం సామాన్య ప్రేక్షకులకు పూర్తిగా సుపరిచితుడు కానప్పటికీ ఇతని రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణమండపం కాన్ఫిడెన్స్ చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం కలగక మానదు. శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ ఎంటర్ టైనర్ ఎన్నో నెలల క్రితమే పూర్తయ్యింది. అయితే వాయిదాకు అందరికీ ఉన్న కారణాలే దీనికీ ఉన్నాయి. వీటి సంగతెలా ఉన్నా ఇప్పుడిది థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఆగస్ట్ 6న రావాలని ఫిక్స్ చేశారని, థియేటర్లను అఫీషియల్ గా తెరిచాక డేట్ ని అనౌన్స్ చేసేందుకు టీమ్ ఎదురుచూస్తోందని సమాచారం. ఇంకో వారం పది రోజుల్లో క్లారిటీ వచ్చేస్తుంది

ఇప్పుడీ సినిమా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏమిటా అని ఆశ్చర్యపడొచ్చు కానీ దీనికి జరిగిన బిజినెస్ లెక్కలు వింటే అసలు విషయం అర్థమవుతుంది. కేవలం మూడు నుంచి నాలుగు కోట్ల బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రానికి సుమారు ఏడు కోట్ల దాకా బిజినెస్ జరిగిందట. డబ్బింగ్ రీమేక్ తదితర హక్కులు ఇంకా నిర్మాతల వద్దే ఉన్నట్టు టాక్. అంటే దాదాపు రెట్టింపు టేబుల్ ప్రాఫిట్ అన్నమాట. చుక్కల చున్నీ పాట యాభై మిలియన్ల వ్యూస్ దాటడం, టీజర్ ని కట్ చేసిన తీరు డిస్ట్రిబ్యూటర్లలో దీని మీద మంచి అంచనాలు రేగేలా చేసింది. అందుకే ఒకే సంస్థ రైట్స్ మొత్తం కొనేసిందట

ఒకవేళ ఆగస్ట్ 6కే కనక ఈ సినిమా కట్టుబడితే చిన్న సినిమాల్లో పెద్ద ధైర్యంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఏప్రిల్ లో వాయిదా పడినవేవీ ఇప్పటిదాకా అనౌన్స్ మెంట్లు ఇవ్వలేదు. లవ్ స్టోరీ జూలై 30 అన్నారు కానీ ఇంకా అధికారికంగా చెప్పలేదు. టక్ జగదీశ్ బృందం సైలెంట్ గా ఉంది. నారప్ప, దృశ్యం 2 ఓటిటి అంటున్నారు కానీ సురేష్ సంస్థ మౌనం అంతుచిక్కడం లేదు. ఇలా చాలా సినిమాలు రిలీజ్ విషయంలో కన్ఫ్యూజన్ ని కొనసాగిస్తున్నాయి.అయినా కూడా ఎస్ఆర్ కళ్యాణ మండపంకి జరిగిన బిజినెస్, విడుదల విషయంలో వాళ్ళ క్లారిటీ చూస్తుంటే కంటెంట్ ఏదో గట్టిగానే ఉన్నట్టు కనిపిస్తోంది. చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి