iDreamPost

ఏ వరల్డ్‌ కప్‌లోనూ ఇలా జరగలేదు.. చరిత్ర లిఖించిన సౌతాఫ్రికా!

  • Author singhj Published - 06:39 PM, Sat - 7 October 23
  • Author singhj Published - 06:39 PM, Sat - 7 October 23
ఏ వరల్డ్‌ కప్‌లోనూ ఇలా జరగలేదు.. చరిత్ర లిఖించిన సౌతాఫ్రికా!

క్రికెట్ వరల్డ్ కప్-2023 ఓపెనింగ్ మ్యాచ్​లో ఇంగ్లండ్​పై న్యూజిలాండ్ ఏకపక్షంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. పసికూన నెదర్లాండ్స్​పై పాకిస్థాన్​ కష్టపడి గెలిచింది. అయినా ఎందుకో టోర్నీపై అంత ఇంట్రెస్ట్ రావడం లేదని ఫ్యాన్స్ అంటున్న వేళ.. భారీ స్కోరు బాది వన్డే క్రికెట్ మజా ఏంటో చూపించింది సౌతాఫ్రికా. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన సఫారీ టీమ్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 428 రన్స్ చేసింది. కెప్టెన్ తెంబా బవుమా (8), మార్కో జాన్​సేన్ (12) తప్పితే ఆ జట్టులో బ్యాటింగ్​కు దిగిన ప్రతి ఒక్కరూ అదరగొట్టారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ల జోరుకు లంక బౌలర్లు దిక్కుతోచక చూస్తూ ఉండిపోయారు.

ఓపెనర్ క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100) సెంచరీతో సత్తా చాటాడు. అతడికి తోడుగా వాండర్ డస్సెన్ (110 బంతుల్లో 108) కూడా శతకం బాది జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. వీళ్లిద్దరూ కలసి రెండో వికెట్​కు ఏకంగా 204 రన్స్ జోడించడం విశేషం. డికాక్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ఎయిడెన్​ మార్క్​రమ్ (54 బంతుల్లో 106) కూడా తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. ఆఖర్లో హెన్రిచ్ క్లాసెన్ (32), డేవిడ్ మిల్లర్ (39) కూడా తమ బ్యాట్లకు పని చెప్పడంతో సౌతాఫ్రికా అలవోకగా 400 స్కోరు దాటింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుశనక 2 వికెట్లు తీయగా.. కసున్ రజిత్, మతీష పత్తిరానా, దునిత్ వెల్లలాగేలకు ఒక్కో వికెట్ దొరికింది.

సౌతాఫ్రికా బ్యాటర్ల ధాటికి లంక బౌలర్లు ధారాళంగా రన్స్ ఇచ్చుకున్నారు. పత్తిరానా, రజితలు 90కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. స్పిన్నర్ వెల్లలాగే కూడా 80కి పైగా రన్స్ ఇచ్చుకున్నాడు. ఈ మ్యాచ్​లో సౌతాఫ్రికా పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఆకాశమే హద్దుగా చెలరేగిన మార్క్​రమ్ 49 బంతుల్లో 100 మార్క్​ను చేరుకున్నాడు. తద్వారా వరల్డ్ కప్-2023లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. ఈ మ్యాచ్​లో సఫారీ టీమ్ నుంచి ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు కొట్టారు. ఒకే ఇన్నింగ్స్​లో ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేయడం ఇప్పటిదాకా ఏ ప్రపంచ కప్​లోనూ జరగలేదు. ఓవర్లన్నీ ఆడిన బవుమా సేన 428 రన్స్ చేసింది. వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే హయ్యెస్ట్ స్కోరు కావడం మరో విశేషం. వరల్డ్ కప్​లో ఎక్కువ సార్లు 400 కంటే ఎక్కువ స్కోరు చేసిన టీమ్​గానూ బవుమా సేన రికార్డు సృష్టించింది.

ఇదీ చదవండి: రచిన్ బ్యాటింగ్​ను మెచ్చుకున్న ద్రవిడ్.. అతడిలో అది ఎక్కువంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి