iDreamPost

సూపర్‌ పవర్‌గా అవతరిస్తున్న సౌతాఫ్రికా! ఈసారి వరల్డ్‌ కప్‌ వాళ్లదేనా?

  • Published Sep 16, 2023 | 3:17 PMUpdated Sep 16, 2023 | 3:17 PM
  • Published Sep 16, 2023 | 3:17 PMUpdated Sep 16, 2023 | 3:17 PM
సూపర్‌ పవర్‌గా అవతరిస్తున్న సౌతాఫ్రికా! ఈసారి వరల్డ్‌ కప్‌ వాళ్లదేనా?

సౌతాఫ్రికా.. పేరుకు పెద్ద టీమ్‌ కానీ, ఇప్పటి వరకు ఒక్క సారి వరల్డ్‌ కప్‌ గెలవలేదు. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడే సౌతాఫ్రికా.. నాటౌట్‌ లాంటి కీలకమైన మ్యాచ్‌ల్లో ఒత్తిడికి చిత్తు అవుతూ.. చోకర్స్‌ అనే ముద్ర వేసుకున్నారు. అనేక సందర్భాల్లో సౌతాఫ్రికా తమపై పడిన చోకర్స్‌ ముద్రను నిజం చేసుకుంటూ.. క్రికెట్‌ అభిమానులను నిరాశపరుస్తుంటుంది. నిజానికి క్రికెట్‌లో హేటర్స్‌ లేని క్రికెట్‌ టీమ్స్‌లో న్యూజిలాండ్‌ తర్వాతి స్థానం సౌతాఫ్రికాదే అని చెప్పాలి. అందుకే ఆ జట్టు వరల్డ్‌ కప్స్‌ లాంటి మెగా టోర్నీల్లో గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓడితే.. అన్ని జట్ల అభిమానులు బాధపడుతుంటారు.

మరికొన్ని వారాల్లో వన్డే వరల్డ్‌ కప్‌ 2023 ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాన జట్ల బలాబలాలపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో వన్డేలో సౌతాఫ్రికా జట్టు బెబ్బులిలా చెలరేగింది. దుర్బేధ్యంగా ఉన్న ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కొంటూ.. ఏకంగా 416 పరుగులు చేసింది. ముఖ్యంగా ఆ జట్టు మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ క్లాసెస్‌ అయితే.. ఆసీస్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 13 ఫోర్లు, 13 సిక్సులతో చెలరేగిపోయాడు. కేవలం 83 బంతుల్లోనే 174 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌తో ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులు నోళ్లలో సౌతాఫ్రికా పేరు మారుమోగిపోతుంది.

అయితే.. ఒక్క క్లాసెన్‌ అనే కాదు, సౌతాఫ్రికా జట్టు మొత్తం అద్భుతంగా ఉంది. టీమ్‌లోని ఆటగాళ్లు తమ రోల్‌ బాగా నిర్వర్తిస్తున్నారు. కెప్టెన్‌ టెంబ బవుమా ఆటగాడిగా ఎలా ఆడుతున్నా.. కెప్టెన్‌గా మంచి పేరుంది. బౌలింగ్‌ మార్పులను అద్భుతంగా చేస్తాడు. ఇక టీమ్‌ని క్వింటన్‌ డికాక్‌ రూపంలో వేగంగా, లాంగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడే ఓపెనర్‌ ఉన్నాడు. హెండ్రిక్స్‌, బవుమా, డసెన్‌ రూపంలో పటిష్టమైన టాప్‌, మిడిల్డార్‌ వాళ్ల సొంతం. ఇక క్లాసెన్‌, మార్కరమ్‌ గురించి అందరికి తెలిసిందే. చివర్లో కిల్లర్‌ ది మిల్లర్‌ ఉండనే ఉన్నాడు. ఇలా సౌతాఫ్రికా బ్యాటింగ్‌ లైనప్‌ శత్రు దుర్భేద్యంగా ఉంది. ఇక బౌలింగ్‌లో కగిసో రబడా, లుంగి ఎన్గిడి, మార్కో జాన్సెన్‌, కేశవ్‌ మహారాజ్‌తో అద్భుతమైన బౌలింగ్‌ ఎటాక్‌ ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికా టీమ్‌.. ప్రత్యర్థులను వణికించేలా ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా టీమ్‌లోని ఆటగాళ్లంతా ఫుల్‌స్వింగ్‌లో ఉన్నారు. వరల్డ్‌ కప్‌లో నాటౌట్‌ మ్యాచెస్‌లో ఒత్తిడి జయిస్తే.. ఈ సారి కప్పు కొట్టకుండా సౌతాఫ్రికాను అడ్డుకునే టీమ్‌ లేదనే చెప్పాలి. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి