iDreamPost

Skylab Review : స్కైల్యాబ్ రివ్యూ

Skylab Review : స్కైల్యాబ్ రివ్యూ

ఎంచుకునే కథల్లో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న సత్యదేవ్ హీరోగా రూపొందిన సినిమా స్కైల్యాబ్. ఒకప్పుడు తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసి ఆ తరువాత గ్యాప్ తీసుకున్న నిత్య మీనన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడమే కాక సహ నిర్మాతగా కూడా వ్యవహరించడంతో సామాన్య ప్రేక్షకుల్లో అంతో ఇంతో ఆసక్తి మొదలైంది. దానికి తోడు ప్రమోషనల్ మెటీరియల్ లో ఇదేదో డిఫరెంట్ పాయింట్ అన్నట్టుగా క్లూస్ ఇవ్వడంతో ఒక వర్గం ఆడియన్స్ కు దీని మీద గురి కుదిరింది. మరి ఈ స్కైల్యాబ్ కు స్కై అంత అంచనాలు లేకపోయినా ఉన్న కాసిన్ని నిలబెట్టుకుందా లేదా రివ్యూలో చూద్దాం

కథ

ఇది 1978లో జరిగిన కథ. కరీంనగర్ జిల్లా బండలింగంపల్లి అనే గ్రామానికి చెందిన యువకుడు ఆనంద్(సత్యదేవ్)తన డాక్టర్ లైసెన్స్ సస్పెండ్ కావడంతో డబ్బు కోసం తాతయ్య(తనికెళ్ళ భరణి)దగ్గరకి వస్తాడు. ప్రతిబింబం పత్రికలో పని చేస్తూ గుర్తింపు ప్రతిభ రెండూ లేక అక్కడికే వస్తుంది దొరబిడ్డ గౌరీ(నిత్యమీనన్). పైసలొచ్చే మార్గం కనిపించకపోవడంతో గ్రామంలోనే క్లినిక్ పెట్టాలని నిర్ణయించుకుంటాడు ఆనంద్. అతనికి అండగా సుబేదార్ రామా(రాహుల్ రామకృష్ణ)ఉంటాడు. అప్పుడే ప్రభుత్వం స్కైల్యాబ్ ఉత్పాతం గురించి ప్రకటిస్తుంది. అక్కడి నుంచి అసలైన డ్రామా మొదలవుతుంది. అది తెరమీదే చూడాలి

నటీనటులు

బ్లఫ్ మాస్టర్, తిమ్మరుసు, ఉమామహేశ్వరఉగ్రరూపస్య లాంటి వాటిలో ఛాలెంజింగ్ కం పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యత ఉన్న రోల్స్ దక్కించుకున్న సత్యదేవ్ కు ఇందులో వాటి స్థాయిలో నిలబడేది దొరకలేదు. డాక్టర్ ఆనంద్ గా చాలా మాములుగా కనిపిస్తాడు. సహజత్వం డిమాండ్ చేసిన క్యారెక్టరే అయినప్పటికీ ఎందుకో తనలో ఆ స్పార్క్ కనిపించదు. దర్శకుడు ఇతర పాత్రలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వడం ఒక కారణం కావొచ్చు. ఎమోషనల్ గా ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడానికి రెండు మూడు చోట్ల అవకాశం దక్కింది కానీ టేకింగ్ వల్ల వాటికి కలిగిన ప్రయోజనం కూడా తక్కువే. మొత్తానికి ఇది కెరీర్ బెస్ట్ లిస్టులోకి రాదు

చాలా కాలం తర్వాత కనిపించిన నిత్య మీనన్ చక్కగా ఉంది. లుక్స్ తో పాటు సహజమైన నటన, స్వంత డబ్బింగ్ తో ఆకట్టుకుంది. గౌరీగా అందులో పర్ఫెక్ట్ గా ఒదిగిపోయింది. ఈ మధ్య మర్చిపోయిన సీనియర్ నటులు నారాయణరావు గారు దొరగా ఉన్న కాసేపు తన టైమింగ్ తో నిలబెట్టారు. ఆయన భార్యగా తులసి కూడా అంతే. రాహుల్ రామకృష్ణకు హీరోతో సమానంగా స్పాన్ దక్కింది. కొన్ని సీన్స్ లో తనకు మాత్రమే సాధ్యమయ్యే టైమింగ్ తో మెప్పించాడు. కమెడియన్ విష్ణు పర్లేదు. తనికెళ్ళ భరణి గారిది రొటీన్ పాత్రే. ఇక గ్రామస్థులుగా ఆర్టిస్టులు చాలానే ఉన్నారు కానీ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సింది మాత్రం వీళ్ళనే

డైరెక్టర్ అండ్ టీమ్

గతం తాలూకు కొన్ని ఆలోచనలు, సంఘటనలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ప్రతిదీ సినిమా మెటీరియల్ గా ఉపయోగించుకోలేము. స్కైల్యాబ్ కాన్సెప్ట్ కూడా అలాంటిదే. ఎప్పుడో నలభై ఏళ్ళ కిందట ఉల్కాపాతం భూమి మీద పడి లక్షల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయన్న ప్రచారం అప్పటి ప్రజానీకాన్ని విపరీతమైన భయాందోళనకు గురి చేసింది. కానీ అదృష్టవశాత్తు అది జరగలేదు. ఉపగ్రహ శకలాలు భారతదేశం మీద పడలేదు. కానీ ఆ సమయంలో జనాలు తీవ్రమైన భావోద్వేగాలకు గురయ్యారు. దర్శకుడు విశ్వక్ ఖండేరావుకు ఈ పాయింట్ ని చాలా ఎగ్జైటింగ్ గా అనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ అదొక్కటే సరిపోలేదు

స్కైల్యాబ్ మొదటిసగం చాలా స్లోగా సాగుతుంది. కథ మొత్తం ఒకే గ్రామంలో నడిపించడంతో పాత్రలు సంభాషణలు రిపీట్ మోడ్ లో నెమ్మదిగా సాగినట్టు అనిపిస్తాయి. ఇది ఖచ్చితంగా రైటింగ్ లోపమే. ఎక్కడా డ్రామా ఉండదు. సన్నివేశాలు చాలా తేలికగా వెళ్లిపోతాయి. ఏదో టీవీ సీరియల్ తరహాలో పాత్రలు పరస్పరం ఒకే మాటను రెండుమూడు సార్లు మాట్లాడుకుంటాయి. చిన్న చిన్న జోకులు అక్కడక్కడా నవ్విస్తాయి. కానీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కు ఇవి చాలవుగా. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ ని సమూలంగా దెబ్బ తీసింది ఇవే. టేకాఫ్ కొంత ఆసక్తికరంగా మొదలుపెట్టినా ఆ తర్వాత పాత్రల ఎస్టాబ్లిష్ మెంట్ కోసం అంత టైం తీసుకోవడం మైనస్ అయ్యింది.

విపరీతాలు సంభవించి తాము కొద్దిరోజులు మాత్రమే బ్రతకబోతున్నామని తెలిసినప్పుడు మనుషుల మధ్య తారతమ్యాలు, విభేదాలు, కోపతాపాలు ఎలా మారిపోతాయో చూపించి ఏదీ శాశ్వతం కాదనే సందేశం ఇవ్వాలనే విశ్వక్ ఉద్దేశం చివరి అరగంటలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ అప్పటిదాకా నడిపించిన కథనం మరీ ఫ్లాట్ గా ఉండటం విసుగుకు కారణం అయ్యింది. ఎక్కడా ఎగ్జైటింగ్ అనిపించే ఎపిసోడ్ ఉండదు. హై ఇచ్చే మూమెంట్స్ ని పెట్టలేదు. థియేటర్ లో మనం చూపించేది సినిమా. డాక్యుమెంటరీ కాదు. అలాంటప్పుడు సినిమాటిక్ నెరేషన్ ప్లస్ ఎంగేజింగ్ కంటెంట్ చాలా అవసరం. ఇది దృష్టిలో పెట్టుకోలేదు

కాన్సెప్ట్ ఎంత మంచిదైనా ప్రెజెంటేషన్ లో జరిగే తడబాటు ఫలితాలను మార్చేస్తుంది. స్కైల్యాబ్ వల్ల ఎలాంటి ప్రమాదం జరగనప్పుడు దాని మీద ఇప్పటి ఆడియన్స్ కి ఎగ్జైట్మెంట్ ఉండదు. అందుకే కామెడీతో నడిపిద్దామని చూసిన విశ్వక్ ఖండేరావు దానికి తగ్గట్టు బలమైన డైలాగ్స్ రాసుకోలేదు. తేలికైన హాస్యానికి జనం నవ్వే రోజులు కావివి. పలు సందర్భాల్లో చెప్పుకున్నట్టు యూట్యూబ్ కంటెంట్ లో పగలబడి నవ్వించే వీడియోలు దొరుకుతున్నప్పుడు సున్నితమైన హాస్యంతో పెదవులపై చిరునవ్వులు పూయించాలంటే మాటలు ఒకటే సరిపోవు. సీన్లు కూడా వాటికి తగ్గట్టు ముందు వెనుకా బలంగా ఉండాలి.

విశ్వక్ ఖండేరావు చేసింది మాత్రం ఒకరకంగా సాహసమే. బడ్జెట్ పరిమితులను దృష్టిలో పెట్టుకుని సింగల్ లొకేషన్ లో ఆ కాలం వాతావరణాన్ని పునఃసృష్టించి ఇలాంటి కథను చెప్పడం అవుట్ అఫ్ ది బాక్స్ (సాంప్రదాయ కమర్షియల్ ఫార్ములాకు ఎదురీదటం) ఆలోచనే. ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే. కానీ మెరుగైన కథా కథనాలు, ఆసక్తికరమైన మలుపులు, డ్రామాను పండించే ఎమోషన్లు, సెంటిమెంట్ ని జోడించి ఉంటే స్కైల్యాబ్ గురించి పేపర్ చదివే అవసరం లేకుండా ఈ సినిమానే రిఫరెన్స్ గా మారిపోయేది. కానీ ఆ ఛాన్స్ మిస్ అయ్యింది. ఫైనల్ గా విశ్వక్ లో ఉన్న రైటర్ కం డైరెక్టర్ అద్భుతాలు చేయకపోయినా టెక్నీషియన్ పాస్ అయ్యాడు

ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా ఆకట్టుకుంటుంది. కంపోజింగ్ బాగుంది. పాటలు ఎక్కువ లేకపోయినా ఉన్నవి కూడా మళ్ళీ వినాలనిపించే స్థాయిలో లేవు. ఆదిత్య జవ్వాది ఛాయాగ్రహణం గట్టి సవాళ్ళే ఎదురుకుంది. ఉన్నంతలో కెమెరా వర్క్ నీట్ గా చూపించే ప్రయత్నం చేశారు. రవితేజ గిరజాల ఎడిటింగ్ ఇంకొంచెం నిడివి తగ్గించి ఉంటే బాగుండేదేమో అనిపించింది కానీ అసలు కంటెంట్ లోనే ల్యాగ్ ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు. స్కైల్యాబ్ కాబట్టి గ్రాఫిక్స్ ఆశిస్తాం కానీ అవి మచ్చుకు కూడా లేవు. కనీసం విజువల్స్ ని కూడా చూపించలేదు. నిర్మాణ విలువలు ఓకే. కాంప్రోమైజ్ స్పష్టంగా కనిపిస్తుంది.

ప్లస్ గా అనిపించేవి

కాన్సెప్ట్
నిత్య మీనన్
ఛాయాగ్రహణం
క్యాస్టింగ్

మైనస్ గా తోచేవి

నిడివి
రిజిస్టర్ కానీ ఎమోషన్లు
ఫస్ట్ హాఫ్
సాగతీత

కంక్లూజన్

ఇప్పటిదాకా ఎవరూ టచ్ చేయని స్కైల్యాబ్ కాన్సెప్ట్ ని సినిమా కోసం తీసుకోవడం వరకు బాగుంది కానీ అది తెరమీదకు వచ్చేసరికి ఆశించిన అనుభూతిని ఇవ్వలేకపోయింది. అప్పటి సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేసిన దర్శకుడు విశ్వక్ ఖండేరావు ఆలోచన మంచిదే. అయితే దానికి అనువైన ప్రెజెంటేషన్, రైటింగ్ లేకపోవడంతో మంచి క్యాస్టింగ్ ఉన్నా కూడా ఇది బెస్ట్ ప్రోడక్ట్ కాలేకపోయింది. ఈ సినిమాను మేకింగ్ ల్యాబ్ లోనే సరైన రీతిలో అల్లుకుని ఉంటే టాలీవుడ్ వెళ్తున్న కొత్త దారికి మరింత ఊతం దక్కేది. కానీ ఇందులో బోలెడు రాళ్లు అడ్డు పడ్డాయి. ఓటిటిలో అయితే మంచి స్పందన దక్కేదేమో.

ఒక్క మాటలో – ‘స్లో’ ల్యాబ్

Also Read : Akhanda Review : అఖండ రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి