iDreamPost

అమరావతికి శాపంలా మారిన అతి

అమరావతికి శాపంలా మారిన అతి

Think Big అనేది పర్సనాలిటీ డెవలప్ మెంట్, లైఫ్ స్టైల్ డెవలప్ మెంట్ ట్రెయినర్లు తమ క్లైంట్లకు చెప్పే మంత్రం. అయితే ఇందులో కొంత రిస్క్ కూడా ఉంది. వ్యక్తిగత స్థాయిలో థింక్ బిగ్ సూత్రాన్ని అనుసరించి దెబ్బ తింటే నష్టం దెబ్బ తిన్న వ్యక్తులకే పరిమితం అవుతుంది. ఏదైనా కంపెనీ ఎగ్జిక్యూటివ్ స్థాయిలో అయితే ఆ కంపెనీ షేర్ హోల్డర్లు దెబ్బ తింటారు. అదే ఏదైనా రాష్ట్ర, దేశ అధినేతలు అయితే ఆ రాష్ట్ర లేదా దేశ ప్రజలందరూ ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది.

అందుకే మన పెద్దలు అతి సర్వత్ర వర్జయేత్ అని జాగ్రత్త కూడా చెప్పారు. ఇప్పుడు ఈ సిద్ధాంతం పాటించకుండా అతి చేసి దెబ్బ తిన్న ఉదాహరణ అమరావతి రూపంలో మన కళ్ల ముందు కనిపిస్తోంది.

అమరావతికి సంబంధించి అన్నీ తానై నడిపించిన మాజీ ముఖ్యమంత్రి ఏ అంశంలోనూ వాస్తవిక దృక్పథం అనుసరించలేదు. అభివృద్ధి చెందుతున్న దేశంలోని ఒక రాష్ట్రానికి చెందిన రాజధాని అని కాకుండా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచే నగరాన్ని నిర్మించాలని అనుకోవడంతో మొదలైన ఈ అతి ప్రతి దశలోనూ కొనసాగింది.

2-4 ట్రిలియన్ డాలర్ల నగరం
అమరావతి అభివృద్ధికి రెండు నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్లు అవసరమని చంద్రబాబు చెప్పారు. మిలియన్, బిలియన్, ట్రిలియన్ లెక్కలు లక్షలు, కోట్లలో లెక్కలు వేసే మనకు కొత్తగా ఉంటాయి. ఒక ట్రిలియన్ డాలర్లు అంటే డెభ్బై లక్షల కోట్ల రూపాయలు అని తెలుసుకుంటే ఇది ఎంత హాస్యాస్పదమో తెలుస్తుంది. రెండు నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్లంటే భారత దేశ జీడీపీతో సమానం అని తెలుసుకుంటే ఈ డిమాండ్ లోని అతి బాగా తెలిసి వస్తుంది.

ప్రపంచంలోనే ఎత్తైన సచివాలయం

212 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయం కడతామని చెప్పడం కూడా మరొక హాస్యాస్పదమైన ప్రకటన. పదమూడు జిల్లాల చిన్న రాష్ట్రానికి ప్రపంచంలో ఎత్తైన సచివాలయం అవసరమా అని అడక్కుండా మీడియా దాన్ని ప్రచారం చేయడం, యాభై మీటర్ల కన్నా ఎత్తైన నిర్మాణాలు చేపట్టడానికి అమరావతిలోని నేల అనుకూలంగా ఉండదని నిపుణులు ఇచ్చిన నివేదిక గుర్తు చేయకపోవడం అనుకూల మీడియా చేసిన తప్పు.

ప్రకృతిని అదుపు చేయడం
అమరావతి విషయంలో చేసిన మరొక ఓవర్ యాక్షన్ ప్రకృతినే కంట్రోల్ చేస్తానని చంద్రబాబు ఇచ్చిన ప్రకటనలు. సముద్రాన్ని అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నానని ఒకసారి, ప్రకృతినే హ్యాండిల్ చేశానని మరొకసారి, అమరావతి నగరంలో నీడని, గాలిని, ఎండని కంట్రోల్ చేసి 14 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గిస్తామని మరొకసారి చెప్పి నవ్వులపాలు అయ్యాడు చంద్రబాబు.
2018లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తామని చేసిన ప్రకటన కూడా మరొక నవ్వు తెప్పించిన విషయం. ఒలింపిక్స్ క్రీడలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారని అందరికీ తెలిసిందే. 2016లో లండన్ లో ఒలింపిక్స్ జరిగాయి. 2020లో మాస్కోలో జరగనున్నాయని కూడా ప్రకటించారు. ఈ మధ్యలో అమరావతిలో ఒలింపిక్స్ ఎలా సాధ్యం అని కూడా ఆలోచించకుండా చంద్రబాబు చెప్పడం, దాన్ని మీడియాలో ప్రచారం చేయడం!!
ప్రపంచంలో ఎక్కడా లేని హైపర్ లూప్ రవాణా వ్యవస్థ మన రాష్ట్రంలో తీసుకొస్తామని చేసిన ప్రకటన కూడా ఇలాంటిదే.
వ్యవసాయంలో నోబుల్ బహుమతి గెలిస్తే వంద కోట్ల రూపాయల బహుమతి కూడా మరొక నవ్వు తెప్పించే విషయం. నోబుల్ బహుమతి ఇచ్చే అంశాల్లో వ్యవసాయం లేదని గమనించకుండా మీడియా ఆ విషయాన్ని ప్రచారం చేసింది.
ఈ విధంగా చూస్తే నోటికి ఏది వస్తే అది చంద్రబాబు చెప్పడం, ముందూ వెనకా చూడకుండా మీడియా టాంటాం చేయడం అమరావతి పట్ల శాపంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి