iDreamPost

కాలు మీద కాలు వేసుకొని స్టైల్​గా కూర్చుంటున్నారా? ఇక అంతే సంగతులు!

  • Author singhj Published - 06:27 PM, Fri - 7 July 23
  • Author singhj Published - 06:27 PM, Fri - 7 July 23
కాలు మీద కాలు వేసుకొని స్టైల్​గా కూర్చుంటున్నారా? ఇక అంతే సంగతులు!

కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడాన్ని చాలా మంది గొప్పగా ఫీలవుతారు. ఇంట్లో పిల్లలు సరిగ్గా చదవకపోతే.. ‘బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకుంటే కాలు మీద కాలు వేసుకొని కూర్చోవచ్చు’ అనే ఈ డైలాగ్​ను పెద్దలు వాడుతుంటారు. కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటే దర్జాలా ఫీలవుతారు. అదే టైమ్​లో పెద్దల ముందు ఎవరైనా పిల్లలు కాలు మీద కాలు వేసుకుంటే తప్పు అని మందలిస్తుంటారు. చాలా సినిమాల్లో ఈ పోజ్​ను వాడుతుంటారు. విలన్ ముందు హీరోను ఎలివేట్ చేయడానికి దీన్ని వినియోగిస్తుంటారు. ఈ పొజిషన్​కు సంబంధించి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’లో ఒక స్పెషల్ డైలాగ్ ఉంది. ‘ఈ కాలు నాదే.. ఆ కాలు నాదే’ అంటూ కాలు మీద కాలు వేసుకొని దర్జాగా కూర్చుంటారు బన్నీ.

కాలు మీద కాలు వేసుకొని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ హైలైట్ అని చెప్పొచ్చు. అయితే ఇలా కూర్చోవడం వల్ల చాలా దుష్ప్రభావాలు ఎదుర్కోక తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ పోజ్ వల్ల ఎన్నో సమస్యలు ఉన్నాయని పలు అధ్యయనాల్లో తేలిందని చెబుతున్నారు. ఇలా కూర్చునే అలవాటు నుంచి త్వరగా బయటపడకపోతే రానురాను పరిస్థితి కష్టమైపోతుందని హెచ్చరిస్తున్నారు. సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం మనుషులు మూడు రకాలుగా కూర్చుంటారని అంటున్నారు. 62 శాతం మంది మనుషులు తమ కాళ్లను కుడివైపు క్రాస్ చేస్తారని.. 26 శాతం మంది ఎడమవైపునకు, ఇక 12 శాతం మంది ఎటు వీలైతే అటు క్రాస్ చేస్తూ ఉంటారని అధ్యయనాల్లో తేలిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కాలుపై కాలు వేసి కూర్చోవడం వల్ల శరీరంపై ఏర్పడే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల హిప్స్ అమరికలో తేడాలు వస్తాయి. ఈ పోజ్ వల్ల మోకాలు, హిప్స్, పాదాలు లాంటి శరీర కింది భాగాలకు సరఫరా అయ్యే రక్తప్రసరణలో తేడా వస్తుంది. చీలమండ దగ్గర క్రాస్ చేసుకొని కూర్చోవడం కంటే మోకాలిపై క్రాస్ చేసి కూర్చోవడం ఇంకా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. కాలు మీద కాలు పెట్టి కూర్చోవడం వల్ల సిరల్లో రక్తప్రవాహం తగ్గి, రక్తపోటు అధికమవుతుంది. కాలుపై కాలు వేసుకొని దీర్ఘకాలం కూర్చుంటే.. కండరాల పొడవు, పెలివిక్ బోన్స్ అమరికలో దీర్ఘకాలిక మార్పులు వస్తాయి. బాడీ ముందుకు వంగిపోయే గుణం, భుజాలు ముందుకు వచ్చే ఛాన్స్ ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. క్రాస్ లెగ్స్ వల్ల వీర్య కణాల ఉత్పత్తి పైనా ప్రభావం పడుతుందని పరిశోధనల్లో రుజువైంది. మగవారితో పోలిస్తే స్త్రీలు తేలిగ్గా కాలు మీద కాలు వేసుకొని కూర్చోగలుగుతారు. కాబట్టి వారికే అదిక ప్రమాదం అని పలు అధ్యయనాలు పేర్కొన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి