Dharani
Dharani
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సింగరేణి కార్మికులకు చెల్లించాల్సిన 11వ వేతన ఒప్పందం 23 నెలల పెండింగ్ బకాయిలను విడుదల చేయడానికి రెడీ అవుతోంది. దీనిలో భాగంగా రూ.1726 కోట్లను సెప్టెంబర్ చివరి నాటికి విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సింగరేణి సంస్థ సంచాలకుడు బలరాం తెలిపారు. పెండింగ్ బకాయిల కింద ఒక్కో కార్మికుడికి సగటున సుమారు రూ.4 లక్షల వరకు అందే అవకాశాలున్నాయని బలరాం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సింగరేణి చరిత్రలోనే మొదటిసారిగా.. కార్మికులకు ఇంత పెద్ద మొత్తంలో.. వేతన బకాయిలను చెల్లిస్తున్నామని తెలిపారు.
ఒకేసారి ఇంత భారీ మొత్తం చెల్లిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా.. ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా ఈ బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. వేతన బకాయిల లెక్కింపు ప్రక్రియను శుక్రవారం నుంచి ప్రారంభించామని.. అన్ని విభాగాల సమన్వయంతో ఈ పని ముగిస్తామని వెల్లడించారు.
సింగరేణి కార్మికులకు దసరా-దీపావళి పండుగ సందర్భంగా ప్రతి ఏటా బోనస్ ఇస్తోన్న సంగతి తెలిసిందే. సింగరేణి కార్మికులకు వచ్చినంత బోనస్.. ఏ శాఖ ఉద్యోగులకు కూడా ఇవ్వరనే టాక్ ఉంది. ఇక ఈ ఏడాది కూడా సింగరేణి కార్మికులకు బోనస్ ఇవ్వడం కోసం రూ.1000 కోట్లు కేటాయించారు. ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ దీని గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వాలు నష్టాల్లోకి నెట్టిన సింగరేణి కాలరీస్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం.. లాభాల్లోకి తీసుకువచ్చిందని తెలిపారు.
కంపెనీ టర్నోవర్‌ను రూ.12 వేల కోట్ల నుంచి రూ.33,000 వేల కోట్లకు పెంచినట్లు ఈ సందర్భంగా వివరించారు. సింగరేణికి 134 సంవత్సరాల చరిత్ర ఉందని.. నిజాం కాలంలో ప్రారంభమైన ఈ కాలరీస్… వందల ఏళ్లుగా వేలాది మందికి అన్నం పెట్టిందని గుర్తు చేశారు. పోయిన దసరా పండుగకు కేవలం రూ.368 కోట్ల బోనస్ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ సారి ఏకంగా రూ. 1000 కోట్లు ప్రకటించిందని చెప్పుకొచ్చారు.